Andhra Pradesh Covid-19 Vaccination: కరోనా కట్టడికి అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సొంతం చేసుకుంది. గత రెండు వారాల క్రితం వ్యాక్సినేషన్‌లో మూడు కోట్ల డోసుల మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఏపీ మరో మైలు రాయిని అధిగమించింది. ఏపీలో ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ 45 సంవత్సరాలు పైబడిన వారికి 100 శాతం కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగిన 3 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో 18-44 మధ్య వయస్సు గల 28.63 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడించింది. ప్రతి జిల్లాలో సగటున 3 రోజుల్లో 2.5 లక్షల మందికి టీకాలు అందించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ డ్రైవ్ లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, ఎమ్.ఎన్.ఓలు, వార్డు సచివాలయం వాలంటీర్లు అందరూ భాగస్వములయ్యారని తెలిపింది. అయితే.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇన్‌ఛార్జులుగా ప్రతి జిల్లా కలెక్టర్లు ఉండి పర్యవేక్షించారని.. దీంతో భారీ లక్ష్యాన్ని అధిగమించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 864 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,30,849 కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారినపడి 12 మంది బాధితులు మరణించారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 14,010కి చేరింది. నిన్న 1,310 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 20,02,187 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,652 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: