ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా మార్చి 27న ఇంటర్ ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. తెలుగు మీడియంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మూడో ప్రశ్నకు ‘ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము?’ అని ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో ‘డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్?’ అని రావడానికి బదులుగా ‘డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్?’ అని తప్పుగా వచ్చింది. దీంతో అన్ని పరీక్ష కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సందేశాలు పంపించింది. ఐతే ఈ విషయం కొన్ని పరీక్ష కేంద్రాల్లో మాత్రమే విద్యార్ధులకు చేరవేశారు. మరి కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చేరలేదు.
దీంతో నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఈ విషయం తెలియజేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికశాస్త్రంలోని తప్పుగా వచ్చిన మూడో ప్రశ్నకు 2 మార్కులు కలపనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. అంటే ఆ ప్రశ్నకు సమాధానం రాసినా.. రాయకపోయినా 2 మార్కులు ఇవ్వనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.