
Ayyanna Patrudu house: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అయ్యన్నపాత్రుడు ఇంటి జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సీపట్నంలో ఇల్లు కూల్చివేతపై అయ్యన్న పాత్రుడు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అయ్యన్న పాత్రుడి తరఫున న్యాయవాది సతీష్ వాదనలు వినిపించారు.. రాజకీయ కక్షలతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని వివరించారు. అర్ధరాత్రి కూల్చివేతలేంటంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ విచారణను ఈనెల 21కి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తదుపరి ఆదేశాల వరకు అయ్యన్నపాత్రుడి ఇంటిని కూల్చవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. హైకోర్టు స్టే అనంతరం అయ్యన్న పాత్రుడి ఇంటికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను ఆదివారం వేకువజామున మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ వ్యవహారంలో అయ్యన్న పాత్రుడి రెండో కుమారుడు చింతకాయల రాజేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
ఈ ఘటనపై ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు, ప్రతిపక్ష టీడీపీ నేతలు పలు విమర్శలు చేసుకున్నారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..