Andhra News: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. రేషన్ డిపోల ద్వారా..
ఏపీ ప్రభుత్వం కీలక తీసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మినీ మార్టులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మినీ సూపర్ మార్కెట్ల తరహాలోనే ఉండే వీటిల్లో తక్కువ ధరకు సరుకులు అందిస్తోంది.

ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ డిపోలు, రైతు బజార్లు ద్వారా 60 రకాల నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలోని రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా ప్రజలకు చౌక ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ వంటి సరుకులను అందించాలని సూచించారు. ఉల్లి నిల్వలు ఎంత ఉన్నాయి.. ఎంత అవసరం అనే దానిపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పంట సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. తాజాగా క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా పరిస్థితులు, తదితర అంశాలను విశ్లేషించుకోవాలని సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూడాలని ఆదేశించారు. పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంతో పాటు పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులతో బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని, మార్క్ ఫెడ్, రైతు బజార్లు, రేషన్ డిపోలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కనీస మద్దతు అమలు చేస్తే రైతులు పండించే ఉత్పత్తులు ప్రభుత్వం వద్దకే చేరతాయని, దీని వల్ల ధరల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.
మిర్చి, ఉల్లి ఎప్పుడు పండించే ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా పండించే అంశాలను పరిశీలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనేది తెలుసుకోవాలని, రైతు సేవా కేంద్రాల వారీగా డేటా సేకరించాలని కోరారు. ఏయే ధరలు పెరుగుతాయనేది ముందస్తుగా అంచనా వేసి అవసరమైన పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించాలని సూచించారు. పశువులకు దాణా కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో పంట సాగు చేయని 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలైన రాగి, జొన్న, కొర్రలు, చిరు ధాన్యాలు వంటివి పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలని కోరారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
