Andhra Pradesh: రోడ్‌షోలపై నిషేధం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి

ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రోడ్‌షోలపై నిషేధం విధించింది. స్టేట్‌, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లపై పొలిటికల్‌ షోలు వద్దని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాల్లోనే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.

Andhra Pradesh: రోడ్‌షోలపై నిషేధం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి
Roadshows

Updated on: Jan 03, 2023 | 11:07 AM

రోడ్‌ షోలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్టేట్‌, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని సూచించింది. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాల్లోనే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు.. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రోడ్ షోలపై నిషేధం పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని విమర్శించారు ఆ పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ధర్నాలు, నిరసనలు చేసే హక్కు అందరికీ ఉందన్నారు. టీడీపీకి ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్‌ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్నారు సోమిరెడ్డి.

ఇక జీఓ నం.1 పై టీడీపీ నేత బొండా ఉమా స్పందించారు. చంద్రబాబు సభకు ఉద్యమాలకు వచ్చినట్టు వస్తున్నారని ఇది చూడలేకే ఈ జీఓను తీసుకొచ్చారని విమర్శించారు. జీఓ నం.1 ద్వారా మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో చెపుతారట.. ఏం మాట్లాడాలో కూడా రేపు వీళ్ళే చెపుతారేమో అంటూ సెటైర్లు సంధించారు. ఇవాళ సీఎం జగన్ ప్రోగ్రామ్ నుంచే జీఓ-1 అమలవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీఓలు లెక్కచెయ్యమన్నారు. చంద్రబాబు కుప్పం సభ కూడా ఉంటుందన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికలో ఈ జీఓ పై చర్చిస్తామన్నారు. టీడీపీ జీఓ-1 పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. మా హక్కులు రాజ్యాంగ పరంగా ఉపయోగించుకుంటామన్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం