
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నేతన్నల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అధికారిక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం రెండు విభాగాలుగా విభజించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. తద్వారా అటు చేనేత, ఇటు మరమగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. చేనేత మగ్గాల కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో 93 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. మర మగ్గాలు కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించనున్నారు. దీంతో 10,534 కుటుంబాలకు లబ్ది జరగనుంది.
సాధారణంగా ఒక చేనేత కార్మికుడు మగ్గం నేయడానికి వాడే విద్యుత్ ఖర్చు వారిపై పెను భారంగా మారుతోంది. ఈ పథకం ద్వారా సగటున ఒక కుటుంబానికి నెలకు రూ. 720 వరకు విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఏడాదికి సుమారు రూ.8,640 నేతన్నల కుటుంబాలకు ఆదా అవుతుంది. ఈ మిగులు ఆదాయం వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు ఎంతో తోడ్పడనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల కష్టాలను స్వయంగా చూశారని, అందుకే పాదయాత్రలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా చేనేత కార్మికుల కోసం మరికొన్ని సంక్షేమ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుందని ఆమె గుర్తు చేశారు. చేనేత కార్మికులకు పెన్షన్ వయస్సును 50 ఏళ్లకు తగ్గించడంతో పాటు నెలకు రూ. 4,000 పెన్షన్ అందిస్తూ వారి వృద్ధాప్యానికి భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. వస్త్ర పరిశ్రమలో ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక, విద్యుత్ బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్న నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం ఒక గొప్ప బూస్ట్ అని చెప్పొచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..