CM Jagan: ఏపీలోని పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 808 చికిత్సలు

|

Sep 30, 2022 | 3:43 PM

ప్రతి ఏటా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఎంత శ్రద్దో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

CM Jagan: ఏపీలోని పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 808 చికిత్సలు
Ap Cm Jagan
Follow us on

ఏపీలోని పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్తగా 808 చికిత్సలు చేర్చబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనుంది. ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా, కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254కు చేరనుంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్ట్ సైతం అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ రివ్యూ చేశారు.  ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104లకోసం సుమారు మరో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.  మొత్తంగా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.  ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు.

మరో 432 కొత్త 104–వాహనాలు

రాష్ట్రంలో మరో 432— 104 వాహనాలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే  676 వాహనాలు సేవలందిస్తున్నాయి. అలాగే ఇప్పటికే  రాష్ట్రవ్యాప్తంగా 748…. 108–వాహనాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.  విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కోవిడ్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలన్నారు సీఎం. దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ చేయాలన్నారు. ఈ ఆడిట్‌ నివేదికలు ప్రతి నెలా కూడా అధికారులకు చేరాలన్నారు.  క్రమం తప్పకుండా ఈ తంతు జరగాలని సూచించారు. ఎక్కడ ఖాళీ వచ్చినా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్‌ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేయాలన్నారు.

పేషెంట్‌ డైట్‌ ఛార్జీల పెంపునకు ఆదేశం…

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100లకు పెంచాలని సూచించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలన్నారు. జూనియర్‌ డాక్టర్ల స్టై ఫండ్‌ పెంపుపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సీఎం సమీక్ష జరిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై మరింత ధ్యాస పెట్టాలన్నారు. అర్బన్‌హెల్త్‌ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు.

ఏపీకి 6 ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డులు…

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకి వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు.  మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయన్నారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది గుర్తింపు అని పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ డీజీ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం