ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసా నిధులు, ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. దీనికోసం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే, సీఎం పర్యటనకు ముందు.. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో అపశృతి నెలకొందంటూ కొన్ని మీడియాలలో ప్రసారం జరిగింది. ఏర్పాట్ల సందర్భంగా జనరేటర్ పేలి నలుగురు మృతి చెందారంటూ ప్రసారం కావడం కలకలం రేపింది. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. అదంతా అసత్య ప్రచారమని.. దీనిని నమ్మవద్దంటూ ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ట్వీట్ చేసింది.
‘‘నలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు” అంటూ ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవం. ఆ జనరేటర్ కూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ పర్యటనకూ ఎలాంటి సంబంధమూ లేదు. సీఎం పర్యటనకు జరిగే ఏర్పాట్ల వల్ల ఆ దుర్ఘటన జరగలేదు. తమ గ్రామంలో జరిగే ఓ ఉత్సవానికి చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామస్థులు తెనాలి నుంచి ఆ జనరేటర్ అద్దెకు తెచ్చారు. అంతేకానీ అది సీఎం పర్యటనకు తెచ్చింది కాదు. ప్రమాదంలో ఇద్దరు మరణించడం,10 మంది గాయపడటం దురదృష్టకరం.’’ అంటూ తెలిపింది.
అలాగే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల్లో సరైన వైద్యం అందక మరో ఇద్దరు మృతి అని ప్రచారం జరిగిందని.. ఇది కూడా అవాస్తవమని పేర్కొంది. ఈ దుర్ఘటనలో మొత్తంగా మరణించింది ఇద్దరేనని.. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..