ఎలుగుబంటి పురుషాంగాన్ని.. ఇతర అవయవాలు తింటే మగవారిలో పవర్ పెరుగుతుందని.. శృంగారంలో చెలరేగిపోతారని.. కొందరు ప్రచారానికి తెరలేపారు. ఈ అపనమ్మకంతో అమాయకమైన ఆ జీవులను వేటాడి.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొందరు వేటగాళ్లు నల్లమల అడవి ప్రాంతంలో ఎలుగుబంటిని వేటాడి చంపారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవి డివిజన్ కొత్తపల్లి మండలం, శివపురం రేంజ్ పరిధిలోని పంట పొలాల్లో కరెంటు తీగలను ఏర్పాటు చేసి ఓ మగ ఎలుగుబంటిని వేటాడారు. అనంతరం ఆ ఎలుగుబంటిని తలను, కాళ్ళను, చర్మాన్ని వేరుచేసి… శరీర భాగాలతో ఆత్మకూరు పట్టణంలోని లాడ్జిలో మకాం వేశారు.
లాడ్జి నుంచి వ్యాపారస్తులతో బేరసారాలు సాగిస్తుండగా.. పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. అక్కడ ముగ్గురు వేటగాళ్లతో సహా అవయవాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యాపారిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఎలుగుబంటి అవయవాలు తింటే పురుషతత్వం పెరుగుతుందన్న అపోహతోనే ఎలుగుబంటి ప్రాణాలు తీశారని.. వన్యప్రాణుల వేట కింద కఠిన చర్యలు చేపడతామని ఆత్మకూరు అటవీ రేంజర్ పట్టాభి తెలియజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ, ఇలాంటి దుష్ప్రచారం నమ్మి ఎవరూ మోసపోవద్దని… వన్య ప్రాణులను చంపితే కఠినమైన శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…