ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి బోధన సమయంలో తరగతి గదుల్లో సెల్ఫోన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మొబైల్ ఫోన్లను వ్యక్తిగత పనులకు వాడుతూ విద్యార్ధులకు నష్టం కలిగిస్తున్నారంటోంది ప్రభుత్వం. బోధనా ప్రమాణాల పెంపునకు ఇది ఆటంకంగా మారిందని చెబుతోంది. తరగతి గదిలో బోధనా ప్రమాణాలు పెంచడంలో భాగంగానే సెల్ ఫోన్ల వాడకంపై నిషేదం విధించినట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. మొబైల్ ఫోన్లు ఎందుకు నిషేధిస్తున్నాం..ఉపాధ్యాయులు,విద్యార్ధులు ఎలాంటి నిబంధనలు ఫాలో కావాలి.. నిబంధనలు పాటించని వారిపై ఎలాంటి చర్యలుంటాయి అనే అంశాలతో కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీఈవోలు,ఆర్జేడీలకు ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చూడాలని సూచించింది.
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు వృత్తిపరమైన అవసరాలకు కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బోధనా సమయాన్ని వృధా చేస్తున్నారంటోంది ప్రభుత్వం. అంతేకాదు యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.ఆగస్టు మూడో తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు. పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం-గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించి విద్యావేత్తలు,నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది.
సెల్ ఫోన్ స్కూల్ కు తీసుకెళ్తే ఎక్కడ ఉంచాలి…ఏం చేయాలి ?
నిపుణుల అభిప్రాయాల ఆధారంగా సెల్ ఫోన్ల వల్ల విద్యార్ధుల అకడమిక్ పెర్మార్మెన్స్కు కు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే తరగతి గదుల్లో బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది సర్కార్. మొబైల్ ఫోన్ వాడకంపై టీచర్లతో పాటు విద్యార్దులకు కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. తరగతి గదుల్లోకి ఉపాధ్యాయులు సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. బోధనా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ వాడకూడదని పేర్కొంది. తరగతిలో విద్యార్ధుల హాజరు తీసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ లను సైలెండ్ మోడ్ లో పెట్టి హెడ్మాస్టర్కు అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ కరికులమ్‌కు సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటే ముందుగానే హెడ్మాస్టర్ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మరోవైపు విద్యార్ధులు కూడా మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా కొన్ని కండిషన్ లు పెట్టింది. తరగతి గదుల్లో విద్యార్ధులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు.హెడ్మాస్టర్ గదిలో లేదా క్లర్క్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అత్యవసరం అయితే హెడ్మాస్టర్ అనుమతి తీసుకుని ఉపయోగించాల్సి ఉంటుంది. తరగతి గదుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసి ఎల్ఈడీ ప్యానళ్లు, స్మార్ట్ టీవీలను కేవలం బోధన కొరకు మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. ఉపాధ్యాయులు ఉదయం తొమ్మిదిన్నరకు ముందు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే సెల్ ఫోన్ వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ అటెండెన్స్ తీసుకోవడం ఆలస్యం అయితే సంబంధిత హెడ్మాస్టర్ అనుమతితో సెల్ ఫోన్ ఉపయోగించాల్సి ఉంటుంది. మొదటి సారి నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి ఇలా చేయమని సంబంధిత ఉపాధ్యాయుడు.. హెడ్మాస్టర్కు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోసారి మండల విద్యాశాఖాధికారితో మాట్లాడిన తర్వాత మాత్రమే సెల్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మూడోసారి గనుక రిపీట్ అయితే ఉపాధ్యాయుడి సెల్ ఫోన్‌ను డీఈవోకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. డీఈవోతో చర్చించిన తర్వాత మాత్రమే సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి సెల్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది.
సెల్ ఫోన్ వాడకంపై విద్యార్ధులు,ఇతరులు ఫిర్యాదు చేస్తే హెడ్‌మాస్టర్లే బాధ్యులు
పాఠశాల విద్యాశాఖ అధికారులు అకస్మిక తనిఖీల సమయంలో సెల్ ఫోన్ నిషేధం నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయో లేదో చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బయటి వ్యక్తులు గాని విద్యార్ధులు గానీ నిబంధనల విషయంలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ను బాధ్యులు చేసేలా ఆదేశాలిచ్చింది. పాఠశాలల్లో తనిఖీల సమయంలో నిబంధనలు ఉల్లంఘించనట్లు తేలితే హెడ్మాస్టర్లదే బాధ్యత అని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. కొన్ని రోజుల పాటు ఈ నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలకు అవగాహన కల్పించిన తర్వాత కఠినంగా అమలుచేయాలని అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.