AP CM YS Jagan Davos Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం.. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు.. అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. ఈ రోజు రాత్రి అక్కడికి చేరుకోకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం జగన్ పాల్గొంటారు. రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం జరుగుతోంది. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొననున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించి.. పెట్టుబడుల కోసం ఆహ్వానించనున్నారు.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా, ఆర్థిక పరిస్థితులు లాంటి కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈ వేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జగన్ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో జగన్ సవివరంగా చెప్పనున్నారు. అలాగే.. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ప్రస్తావించనున్నారు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పీపుల్-ప్రోగ్రెస్-పాజిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కేసులు పెరగడంతో ఈ సమ్మిట్‌ను వాయిదా వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి