వైఎస్ఆర్ బీమా పథకంపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా మార్పులు చేశారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్యవారు సహజంగా మరణించినా.. ఆ కుటుంబానికి రూ. లక్ష ఆర్థికసాయం చేయనున్నారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుంది. మార్పులు చేసిన వైఎస్‌ఆర్ బీమా పథకం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. బీమా పరిహారం దరఖాస్తులన్నీ నెలరోజుల్లో పరిష్కరించాలని ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జులై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో చిక్కులు ఉండొద్దని నిర్ణయించింది.
Also Read: లాక్డౌన్ సడలింపు.. రేపట్నుంచి హైదరాబాద్‌లో మెట్రో పరుగులు.. మారిన టైమింగ్స్ ఇవే..