ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా నేడు జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ రెండు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టింది. మొదట సీఎం జగన్ స్వయంగా మాట్లాడుతూ.. బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలంటూ సభ ఎదుట తీర్మానించారు. ఈ క్రమంలో ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నా ప్రభుత్వంలో వారికి అన్యాయం జరగదు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ఈ తీర్మానానికి వచ్చామ’ని అన్నారు.
ఇంకా తాను 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ఆయా కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది. ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.
అనంతరం మంత్రి మేరుగు నాగార్జున.. మరో మతంలోకి మారినంతనే దళితుల స్థితిగతులలో ఎటువంటి మార్పు కలగబోదని పేర్కొన్న ఆయన.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలనే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు సామాన్యులకు చేరుతున్నాయని, గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని తెలిపారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..