ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో 65 మందికి పైగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్.. పార్లమెంట్ స్థానాల పరిధిలో ఇద్దరు అభ్యర్థులను కొనసాగిస్తూనే 14 మందిని కొత్తవారిని ఇంచార్జిలుగా నియమించారు.
ఇక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మిగతా వాటిపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్ ల పరిధిలో ఏడు దశల్లో 65 మందిపైగా అభ్యర్థులను మార్పులు చేశారు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో 16 మందిని ఇప్పటికే ఫైనల్ చేసిన సీఎం జగన్.. ఇప్పటి వరకు నియమించిన 16 స్థానాల్లో 14 మందిని కొత్తవారిని నియమించగా రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో సిట్టింగ్ లకు అవకాశం కల్పించారు.
తిరుపతి నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని, చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పను కొనసాగిస్తూ వారిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాలను త్వరలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుని పార్లమెంట్ సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో సిట్టింగుల పనితీరు, ఎమ్మెల్యేలతో సఖ్యత, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మిగతా 9 పార్లమెంటు స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంపిక కోసం అనౌన్స్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు వైసీపీ అధినేత జగన్.
ఆయా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు వీళ్లేనా?
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రకటించిన 16 పార్లమెంట్ల పరిధిలో 14 మంది అభ్యర్థులను కొత్త వారిని నియమించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక త్వరలో ప్రకటించబోయే తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో రెండు సిట్టింగులకు అవకాశం ఇవ్వనున్నారు. అందులో ఒకటి కడప వైఎస్ అవినాష్ రెడ్డి కాగా, రెండోది రాజంపేట నుంచి మిధున్ రెడ్డి. మళ్ళీ సిట్టింగ్‌లుగా అదే స్థానాల్లో బరిలో ఉండబోతున్నారు. ఇక మిగతా ఏడు స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక పెండింగ్‌లో ఉన్న అనకాపల్లి పార్లమెంటు స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న అడారీ ఆనంద్ సోదరి రమ, లేదా డాక్టర్ విశ్వనాథ్ బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇక విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బొత్స మేనల్లుడు శీను లేదా సిట్టింగ్ ఎంపీగా ఉన్న చంద్రశేఖర్‌ను పోటీ చేయించాలని చూస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మజ్జి శ్రీను సుముఖుంగా లేకపోవడంతో పాటు ఆయన ఎమ్మేల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న కారణంగా బెళ్లన చంద్రశేఖర్ కు మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక అమలాపురం నుంచి మంత్రిగా ఉన్న విశ్వరూప్ లేదా సిట్టింగ్ ఎంపీగా ఉన్న అనురాధను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం విశ్వరూప్ అమలాపురం ఎమ్మేల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను బరిలోకి దింపాలని బావిస్తున్నారు. లేని పక్షంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న చింతా అనురాధను మళ్ళీ పోటీ చేయించే అవకాశం ఉంది.
ఇక బాపట్ల ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని సీఎం జగన్ బావిస్తున్నారు. రావెల కిషోర్ బాబు సతీమణి లేదా ఆయన కుమారుడిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే తనకు మరో మారు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ సిట్టింగ్ ఎంపీగా నందిగామ సురేష్ కోరుతున్నారు. ఇక నంద్యాల నుంచి పోచ బ్రహ్మానంద రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ముస్లిం మైనారిటీలకు ఈ సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట జగన్. సినీ నటుడు అలీ లేదా ఇక్బాల్ పేరును పరిశీలిస్తుంన్నారట.
ఇక ఒంగోలు నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం వైసీపీలో నెలకొన్న విభేదాలు వివాదాలకు చెక్ పెట్టేందుకు చెవిరెడ్డిని వెళ్లాలని జగన్ సూచించడంతో ఆయన బాలినేని శ్రీనివాసులు రెడ్డితో ఇప్పటికే భేటీ అయి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే చెవిరెడ్డినీ బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. .ఇక నెల్లూరు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అరబిందో శరత్ చంద్రారెడ్డిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టాలంటే శరత్ చంద్రారెడ్డి అయితే సరైన అభ్యర్ధిగా భావిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తానికి పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో ప్రక్రియ మొత్తాన్ని దాదాపు క్లియర్ చేయాలని భావిస్తున్న తరుణంలో మరో రెండు లేదా మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి…