YSR Nethanna Nestham: సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలోనూ.. సంక్షేమం పథకాలను కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని నేతన్నలకు ఆసరాగా తీసుకువచ్చిన ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంలో భాగంగా మూడవ విడత నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వర్చువల్‌గా మూడో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ. 192.08 కోట్ల నిధులను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు అందించనున్నారు.
రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతీ చేనేత కుటుంబానికి ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం కింద ఏటా రూ. 24 వేల చొప్పున.. ఐదేళ్లలో రూ.1,20,000 ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు 2019, డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటి వరకు రెండు దఫాలుగా లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మూడో విడతగా.. లబ్ధిదారులకు డబ్బులు అందిస్తున్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేపట్టింది. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. కాగా, ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 383.99 కోట్లు ఖర్చు చేయగా.. ఇవాళ విడుదల చేయనున్న రూ. 192.08 కోట్లతో కలిపి రూ.576.07 కోట్లు నేతన్నలకు ఖర్చు చేయనున్నారు..
Also read:
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..