చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ థర్డ్‌వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్ సమగ్రంగా చర్చించారు.
థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు.
ఇప్పటికే తిరుతి రుయా ఆస్పత్రిలో ఓ వార్డును చిన్నారుల కోసం ఏర్పాటు చేశారు. రెండు రోజుల వ్యవధిలో 29మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ కూడా సిద్ధం చేశారు.