Andhra Pradesh: సీఎం చంద్రబాబు ఆరు రోజుల సింగపూర్‌ టూర్‌… మంత్రి లోకేశ్‌ సహా…

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనకు ఆయని ఇవాళ రాత్రి 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు సింగపూర్‌కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు...

Andhra Pradesh: సీఎం చంద్రబాబు ఆరు రోజుల సింగపూర్‌ టూర్‌... మంత్రి లోకేశ్‌ సహా...
Chandrababu

Updated on: Jul 26, 2025 | 9:54 AM

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనకు ఆయని ఇవాళ రాత్రి 11 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు సింగపూర్‌కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగపూర్‌ వెళ్లనుంది. 6 రోజుల పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది. బ్రాండ్ ఏపీని మరోసారి ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ టూర్ లక్ష్యమంటోంది ఏపీ.

ఈ పర్యటనలో ప్రవాసాంధ్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని ఆహ్వానించబోతున్నారు. జులై 27న ‘వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్’ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో చంద్రబాబు బృందం సమావేశం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగే ఈ సభలో విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయుల ముందు చంద్రబాబు తన ప్రణాళికను ఉంచనున్నారు. అమరావతి మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ప్రభుత్వం తిరిగి కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కావాలని ఉవ్విళ్ళూరుతుండడంతో నిర్వహకులకు కష్టతరంగా మారింది. 5 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తుండగా, నమోదు మెుదలైన రెండు రోజుల్లోపే ఆ సంఖ్య దాటుతుండగా ఈ ప్రక్రియ ఆపివేసినట్లుగా నిర్వహకుల్లో ఒకరైన మద్దుకూరి సర్వేశ్వరరావు తెలిపారు. ప్రవాసీయుల సభ నిర్వహణకు వేమూరి రవికుమార్ నేతృత్వంలో టీడీపీ ప్రవాసీ వ్యవహారాల నాయకుడు రావి రాధకృష్ణ కసరత్తు చేస్తున్నారు.

తిరిగి ఏపీకి చేరుకోనున్న సీఎం ఆగస్ట్‌ ఒకటిన జమ్మలమడుగులో పెన్షన్ పంపిణీ చేయనున్నారు. సింగపూర్ పర్యటన వివరాలను ఆగస్ట్‌ 6న జరిగే కేబినెట్‌ భేటీలో వివరిస్తారు సీఎం చంద్రబాబు. సింగపూర్ ప్రభుత్వ ఉద్దేశాన్ని కేబినెట్‌లో చర్చించిన అనంతరం తదుపరి ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు సింగపూర్‌ను మర్చిపోలేకపోతున్నారని మాజీ మంత్రి శైలజానాథ్‌ విమర్శించారు. చంద్రబాబుతో అసెండాస్‌కు ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.