విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు. దసరా నవరాత్రుల్లో మూలనక్షత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇది అమ్మవారి జన్మనక్షత్రం.. త్రిశక్తులలో ఓ స్వరూపం అయిన సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు . దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి బారులు తీరారు. ఆలయ అధికారులు అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
ఈ సందర్బంగా కనకదుర్గమ్మ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మకు చంద్రబాబు దంపతుల రాష్ట్ర ప్రజల తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. బాబు దంపతులతోపాటు, లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కుటుంబానికి వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు కనకదుర్గమ్మ ఆలయాన్నికి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.