Chandrababu Naidu arrest: ఈ విచారణలో ముఖ్య పాత్రధారి చంద్రబాబు, లోకేశ్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది – సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై వివరణ ఇచ్చారు సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణలో ముఖ్య పాత్రధారిగా చంద్రబాబు ఉన్నారని చెప్పారు సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్. వికాస్ ఖన్విల్కర్‌ను ఇంకా లోతుగా ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. దారి మళ్లింపు నిధుల జాడ తెలుసుకునేందుకు చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అన్నింటిలోనూ చంద్రబాబు ప్రమేయం ఉందని స్పష్టమైందని చెప్పారు. అన్ని వెలుగులోకి తెచ్చేందుకు కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఈ కేసు విచారణలో భాగంగా లోకేశ్‌ను కూడా ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. ఇది లోతైన ఆర్థిక నేరంగా పరిగణించారు- సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్.
స్కిల్ డెవలప్ మెంట్ కేసలో నిధుల దారి మళ్లింపులో లబ్ది పొందింది చంద్రబాబే అన్నారు సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్. కోర్టు ముందు అన్ని పత్రాలు సమర్పిస్తామన్నారు. రూ.371 కోట్లు జీ.ఓ ద్వారా విడుదలయ్యాయి. ఆ 371 కోట్లు డిజైన్‌టెక్ సంస్థకు బదిలీ చేయడం జరిగిందన్నారు. ఆ కంపెనీ నుంచి PVSP, మరో డొల్ల కంపెనీకి బదిలీ అయ్యాయని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..