మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన సీఎం జగన్(CM Jagan) పర్యటనలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ప్రకృతి చికిత్స పొందుతున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని(Haryana CM Manoharlal Khattar) మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చిన సీఎం 2 గంటల పాటు విశాఖలో ఉన్నారు. ఈ క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచే కార్యక్రమం నుంచి విశాఖలో పార్టీ బలోపేతం వరకు పలు అంశాలపై దృష్టి పెట్టారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నేతలకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమను పరిశీలించ లేదంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అసంతృప్తిగా ఉన్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు మంత్రి పదవి రెన్యువల్ అవుతుందని ఆశించి భంగపడ్డ తాజా మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ లాంటి పరిణామాల మధ్య జిల్లాలో పర్యటించారు.
సీఎంని కలిసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పోటీపడ్డారు. కానీ తీవ్ర అసంతృప్తితో ఉన్న బాబురావు.. సీఎం పర్యటనలో ఎక్కడా కనపడలేదు. అలాగే మంత్రి పదవి ఆశించి నిరాశ చెందిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా హాజరుకాలేదు. కానీ ముందే నిర్ణయించుకున్న కార్యక్రమం వల్ల రాలేకపోయానని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు.
ముఖ్యమంత్రి రాగానే స్వాగతం పలుకుతున్న క్రమంలో.. తనకు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా కలుస్తానని ఎమ్మెల్యే ధర్మశ్రీ కోరారు. దానికి సీఎం వెంటనే స్పందిస్తూ.. మిమ్మల్ని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని చేస్తున్నాం. 2 రోజుల్లో దానికి సంబంధించి కలవాల్సి ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి. అలాగే పక్కనే ఉన్న అవంతి, కేకే రాజును చూస్తూ విశాఖ జిల్లా అధ్యక్షులుగా అవంతి అన్న ఉంటారంటూ చెప్పారు.
ఎయిర్ పోర్టుకి వెళ్లే రూట్‌లోనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ హరిబాబు ఉన్నా కలవకపోవడం.. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి కీలక నేతలు లేకుండానే విశాఖలో పర్యటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదు..
Minister Harish Rao: రోగి సహాయకులకు రూ.5 భోజనం.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..