Andhra: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇక చెల్లింపులు

ఏపీ కేబినెట్‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశ్వసనీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా కేటగిరీలుగా విభజించనుంది. ఒక్కో కేటగిరీకి గరిష్ఠంగా రూ.15 వేల వరకు చెల్లించనుంది.

Andhra: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇక చెల్లింపులు
Andhra Pradesh Government

Updated on: Sep 23, 2026 | 6:05 PM

సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకునేందుకు కూడా చాలామంది సోషల్ మీడియానే వేదికగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డిజిటల్ ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. యువతను సోషల్ మీడియా ద్వారా చేరుకోవాలని ప్రభుత్వం ఇటీవల మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ పాలసీలో భాగంగా.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వసనీయత ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, వారికి ధ్రువీకరణ కల్పించే విధానం ఉండనుంది. అయితే ఎవరు పడితే వారు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉండదు. ఇందుకోసం నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా గుర్తింపు, ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

మరోవైపు ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా విభజించనున్నారు. ఒక్కో కేటగిరీకి అనుగుణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేయనున్నారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్ఠంగా రూ.15 వేల వరకు చెల్లించే అవకాశం ఉంది. అలాగే 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్న వారికి రూ.7,500 వరకు చెల్లించనున్నారు. 25 వేల నుంచి 49,999 ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.5 వేల వరకు, 10 వేల నుంచి 24,999 ఫాలోవర్లు ఉన్న వారికి రూ.2,500 వరకు చెల్లించేలా పాలసీలో కేటగిరీలను రూపొందించారు. అంటే.. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్యతో పాటు విశ్వసనీయతకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఒక కమ్యూనికేషన్‌ వేదికగా ఉపయోగించుకోవడం ఈ విధానం ద్వారా లక్ష్యంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో.. సంప్రదాయ ప్రచార పద్ధతులతో పాటు డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. ఏపీలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను యువతకు, ముఖ్యంగా డిజిటల్ వేదికలపై చురుకుగా ఉండే వర్గాలకు చేరువ చేయడంలో ఈ పాలసీ కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ పాలసీ కింద ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపిక, ధ్రువీకరణకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, చెల్లింపుల విధానం తదితర అంశాలపై మరిన్ని వివరాలు ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us