Andhra: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉండటంతో బీసీ రిజర్వేషన్లపై తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.

Andhra: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court

Updated on: Oct 09, 2026 | 12:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై అభ్యంతరం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 243-D(6), 243-T(6) ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాల పరిధి, రిజర్వేషన్లను సమర్థించేందుకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలపై ఈ వివాదం కొనసాగింది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు నిర్ణయించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలన్నది కూడా కీలక అంశంగా మారింది.

ఇదే అంశంపై అక్టోబర్‌ 1, 2026న ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 105, జీవో ఆర్టీ నంబర్‌ 1065లను కొట్టివేసింది.

50 శాతం దాటితే ప్రత్యేక ఆధారాలు తప్పనిసరి

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతం పరిమితిని మించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లను ఈ పరిమితికి మించి అమలు చేయాలంటే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో సూచించిన విధంగా సమగ్రమైన అనుభవాధారిత గణాంకాల సేకరణ, పరిశీలన జరగాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా ఊరట లభించలేదు. దీంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన అడ్డంకులు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us