AP Bandh Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్‌.. బీజేపీ మినహా మద్ధతు ఇచ్చిన అన్ని పార్టీలు..

|

Mar 05, 2021 | 11:39 AM

AP Bandh On Vizag steel plant Privatisation: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపినిచ్చిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం..

AP Bandh Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్‌.. బీజేపీ మినహా మద్ధతు ఇచ్చిన అన్ని పార్టీలు..

AP Bandh On Visakha Steel Privatisation: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపినిచ్చిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ సైతం మద్ధతు ఇవ్వడం విశేషం. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌ ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డీపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసనల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్‌, టీఎన్‌టీయూసీ, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు పాల్గొన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోనూ బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాకినాడలో జెఎన్‌టీయూలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్‌ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్‌, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్‌ మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ట్రావెల్స్‌, ఆటో డ్రైవర్‌ పాటిస్తుండడంతో జన సంచారం పూర్తిగా నిలిచిపోయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2021 11:12 AM (IST)

    జెఎన్‌టీయూ పరీక్షలు వాయిదా..

    తూర్పుగోదావరి జిల్లాలోనూ బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాకినాడలో జెఎన్‌టీయూలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్‌ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్‌, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్‌ మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ట్రావెల్స్‌, ఆటో డ్రైవర్‌ పాటిస్తుండడంతో జన సంచారం పూర్తిగా నిలిచిపోయింది.

  • 05 Mar 2021 10:11 AM (IST)

    కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకోవాలి..

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం సంతోషమని తెలిపారు. సీఎం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని కోరిన నారాయణ.. రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట ఢిల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐక్య ఉద్యమాల ద్వారానే విశాఖ స్టీల్‌ను రక్షించుకోగలమని నారాయణ అభిప్రాయపడ్డారు.


  • 05 Mar 2021 09:41 AM (IST)

    కర్నూలులో కార్మిక సంఘాల నేతల నిరసన..

    రాష్ట్ర బంద్‌ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. వ్యాపార సంస్థల యజమానులు స్వచ్చంధంగా బంద్‌కు మద్దతు పలికారు.

  • 05 Mar 2021 09:07 AM (IST)

    గుంటూరులో కొనసాగుతోన్న రాష్ట్ర బంద్‌.. డిపోలకే పరిమితమైన బస్సులు..

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్‌ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. గుంటూరు1, 2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, బాపట్ల, రేపల్లే, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరి పేట, సత్తెనపల్లి, పిడుగురాళ్లకు చెందిన బస్సులన్నీ పూర్తిగా డీపోలకే పరిమితమయ్యాయి.

  • 05 Mar 2021 08:46 AM (IST)

    మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి ఆందోళన..

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్‌కు మద్దతు పలుకుతూ కావలిలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రహదారిపై నిరసనకు దిగారు.

  • 05 Mar 2021 08:40 AM (IST)

    స్టీల్‌ ప్లాంట్‌లో విధులు బహిష్కరించిన కార్మికులు..

    విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతుగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు A షిఫ్టులో విధులను బహిష్కరించారు. కూర్మనపాలెం వద్ద రహదారిపై బైఠాయించిన కార్మికులు తమ నిరసనను తెలిపారు.

  • 05 Mar 2021 08:36 AM (IST)

    ఆ పార్టీలు పోరాడటం శుభపరిణామం.

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ, టీడీపీ పోరాడటం శుభపరిణామని సీపీఎం నేత మధు అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయమై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ విషయంలో ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మారాలని డిమాండ్‌ చేశారు.

  • 05 Mar 2021 08:31 AM (IST)

    మూత పడ్డ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు..

    విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన బంద్‌తో అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. బంద్‌కు లారీ యాజమాన్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సైతం బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. బంద్‌ నేపథ్యంలో ఒంటిగంట వరకు బస్సులు డిపోలకే పరిమితంకానున్నాయి. మధ్యాహ్నం తర్వాత బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

  • 05 Mar 2021 08:25 AM (IST)

    విజయవాడలో నిరసనల్లో పాల్గొన్న ట్రేడ్‌ యూనియన్‌, సంఘాలు..

    విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్‌కు మద్ధతుగా విజయవాడ నెహ్రూ బస్‌స్టేషన్‌ ఎదుట రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్‌, టీఎన్‌టీయూసీ, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు సైతం నిరసనలో పాల్గొన్నాయి.

Follow us on