AP Assembly: ఏ సెషన్ చూసినా ఏముంది గర్వకారణం.. అంతా సస్పెన్షన్ల పర్వం..!

ఇలా ఉదయం 9గంటలకు మొదలైన సభ.. మధ్యాహ్నం ఒంటిగంట దాకా వాయిదాలు పడుతూ.. చివరకు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తర్వాత రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీలో చర్చలు జరగాలి.. ప్రజా సంక్షేమ బిల్లులపై అర్థవంతమైన చర్చలు జరిగి.. ఆమోదం పొంది చట్టం కావాలి. ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఇది మామూలుగా ప్రాసెస్.

AP Assembly: ఏ సెషన్ చూసినా ఏముంది గర్వకారణం.. అంతా సస్పెన్షన్ల పర్వం..!
Ap Assembly

Updated on: Sep 21, 2023 | 9:50 PM

అసెంబ్లీ లోపలా యుద్ధమే.. అసెంబ్లీ బయటా యుద్ధమే.. మాటల్లోనూ యుద్ధమే.. చేతల్లోనూ యుద్ధమే.. అసలు అసెంబ్లీ అంటేనే ఓ యుద్ధంలా ఎగబడటమే అన్నట్టుగా మారిపోయాయి.. ఇవాళ్టి అసెంబ్లీ సెషన్స్. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఆ తర్వాత..

సమయం ఉదయం 9.05 గంటలు.. చంద్రబాబు కేసుపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. యాజ్‌ యూజ్‌వల్‌గా స్పీకర్ టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.

సమయం ఉదయం 9:09 గంటలు.. ప్రశ్నోత్తరాలు మధ్యలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

సమయం 9.20 గంటలు.. సభలో గందరగోళం మరింత పెరిగింది. టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని మంత్రి బుగ్గన ప్రకటించారు. అయినా టీడీపీ శాంతించలేదు.

సమయం 9.25గంటలు.. టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. స్పీకర్ వారించినా వెనక్కి తగ్గలేదు. కానీ అంతలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పి ఏదో సంజ్ఞ చేసారంటూ వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. బాలకృష్ణ, టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మీసాలు రోషాలు.. తొడలు అంటూ సినిమాటిక్ భాషలో అంబటి మార్కు స్టైల్లో టీడీపీపై పంచ్‌ల వర్షం కురిపించారు.

సమయం 9:32గంటలు.. టీడీపీ సభ్యులు ఏమాత్రం తగ్గేలేదు. తమ ఆందోళను కంటిన్యూ చేస్తూ స్పీకర్‌ చుట్టూ నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పీకర్ మానిటర్‌ను డ్యామేజ్ చేస్తున్నట్లు.. టీడీపీ సభ్యులు బల్లలు చరుస్తూ.. సభను అవమానిస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పే ప్రయత్నం చేస్తూ.. టీడీపీ సభ్యులకు మరోసారి తిరగ మోతపెట్టారు.

సమయం 9.36గంటలు.. సభ జరిగే పరిస్థితులు లేకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

సమయం 10గంటలు.. ఇది జరిగిన కాసేపటికి అంటే సరిగ్గా పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇక్కడా అసెంబ్లీలో సీన్స్ మళ్లీ రిపీట్ అయ్యాయి. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వడం చైర్మన్ తిరస్కరించడం.. ప్రశ్నోత్తరాలు ప్రారంభించడం వెంటవెంటనే జరిగాయి. ఆ వెంటనే టీడీపీ సభ్యుల నినాదాలు ప్రారంభమయ్యాయి.

సమయం 10.16 గంటలు.. టీడీపీ, పీడీఎఫ్‌ సభ్యుల ఆందోళనలతో సభ ఐదు నిమిషాలు వాయిదా వేశారు చైర్మన్‌..

సమయం 11.05గంటలు.. తిరిగి మరోసారి అసెంబ్లీ ప్రారంభమైంది. వెంటనే స్పీకర్ తమ్మినేని బాలయ్య తీరును తప్పుబడుతూ.. ఓ హెచ్చరిక చేశారు. సభలో మీసాలు తిప్పడం సభా నియమాలను ఉల్లంఘించడమేనని.. తొలి తప్పుగా భావించి చర్యలు తీసుకోవడం లేదంటూ బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు.

సమయం 11.10గంటలు.. స్పీకర్ హెచ్చరికనూ పట్టించుకోని టీడీపీ సభ్యులు మళ్లీ అదే రీతిలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పదే పదే హెచ్చరిస్తున్నా వినకపోవడంతో.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌లను సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెన్షన్ వేటు వేశారు. మిగిలిన టీడీపీ సభ్యులందరినీ ఒక్కరోజు సస్పెన్షన్‌ విధించారు. సస్పెండ్ అయినవారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు.

సమయం 12.23గంటలు.. కాసేపు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. టీడీపీ సభ్యులు లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు సాగించారు. అంతకుముందు జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఐదు రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించారు. శని, ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటించారు.

సమయం ఒంటిగంట.. అసెంబ్లీతో పాటు శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలోనూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. అలా రెండు సార్లు వాయిదాపడ్డ మండలిని రేపటికి వాయిదా వేశారు మండలి చైర్మన్.

ఇలా ఉదయం 9గంటలకు మొదలైన సభ.. మధ్యాహ్నం ఒంటిగంట దాకా వాయిదాలు పడుతూ.. చివరకు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తర్వాత రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీలో చర్చలు జరగాలి.. ప్రజా సంక్షేమ బిల్లులపై అర్థవంతమైన చర్చలు జరిగి.. ఆమోదం పొంది చట్టం కావాలి. ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఇది మామూలుగా ప్రాసెస్. కానీ ఏపీలో అలాంటి ప్రశాంత పరిస్థితులు రాజకీయంగా అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. కారణం చంద్రబాబు అరెస్ట్. స్కిల్ కేసుపై సీఐడీ విచారణ. నో బెయిల్.. ఓన్లీ జైల్ అన్నట్టుగా సాగుతున్న విచారణపై టీడీపీ సలసలా కాగుతోంది. అందుకే ఎప్పుడూ అసెంబ్లీలో ప్రశాంతంగా ఉండే బాలకృష్ణ సైతం ఇవాళ మరింత రెచ్చిపోయారా..? రెచ్చగొట్టారా..? తెలియదు కానీ తొలిరోజు సెషన్స్ అంతా బాలకృష్ణ సెంట్రిక్‌ గానే రచ్చ జరిగిందన్నది వైసీపీ సభ్యుల ఆరోపణ. దానికి అంబటి రాంబాబు కౌంటర్లు వాడి వేడిగా ఉండడంతో…సభ మరింత హీటెక్కింది.

చంద్రబాబు కేసుపై విచారణకు సిద్ధమే అంటూ వైసీపీ సర్కార్ పదే పదే చెబుతూ వస్తోంది. కానీ ఇవాళే చర్చ జరగాలన్నది టీడీపీ సభ్యులు పట్టుపడడంతో.. విషయం మరింత విషమించింది. చర్చకు బదులు రచ్చ చోటు చేసుకుంది. మామూలుగా చంద్రబాబు అరెస్ట్‌పై రగడ తప్పదని అందరూ భావించిందే. కానీ ఈ రేంజ్‌లో ఊహించలేదు సామాన్య ప్రజానీకం. మామూలుగా వైసీపీ సర్కార్.. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వ అవినీతిపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారట. అలాగే అసెంబ్లీ జరిగినన్ని రోజులు రోజుకో సబ్జెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించారట. ప్రస్తుత ప్రభుత్వ పని తీరు.. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాలన్నది అధికారపార్టీ అజెండా. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరపాలని మంత్రులకు, చీఫ్ విప్‌లకు సీఎం ఆదేశించారని సమాచారం. కానీ తొలిరోజు వాయిదార్పణం అయింది. ఇదంతా టీడీపీ సభ్యుల ఓవరాక్షన్‌తోనే అన్నది వైసీపీ నేతల వాదన. సభా మర్యాదను అగౌరవపరిచేలా టీడీపీ నేతల ప్రవర్తన ఉందని.. ప్రజల సమస్యలు పట్టించుకోని విపక్షనేతలు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు కోసం పోరాడుతున్నారంటూ మండిపడుతోంది అధికారపార్టీ. చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తాం అంటూ సవాల్ విసురుతోంది వైసీపీ.

అయితే సభా మర్యాదలను తామేమీ ఉల్లంఘించలేదని.. వైసీపీ నేతలే తమను రెచ్చగొట్టారని రివర్స్ అటాక్‌కు దిగుతోంది టీడీపీ. మీసాలు తిప్పింది వాళ్లే.. తొడలు కొట్టింది వాళ్లే. అంతా వాళ్లే చేశారంటూ తెలుగుదేశం నేతలు అధికారపార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుపై కేసు అక్రమంగా పెట్టారని, దీనిపై పోరాటం ఆపేది లేదని.. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసులు పెట్టారని గట్టిగా వాదిస్తోంది టీడీపీ. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. ప్రభుత్వం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలన్నది విపక్ష టీడీపీ డిమాండ్. అదేంటో అసెంబ్లీ ప్రారంభమైతే చాలు.. పూనకాలు లోడింగ్.. అన్నట్టుగా మారిపోతుంటారు మన సభ్యులు. ప్రభుత్వంది విపక్షాలకు తలొగ్గేదేలే.. అంటూ పట్టుబిగించడం.. తామూ తగ్గేదేలే అంటూ విపక్షాలు ఫిక్సవడంతోనే ఈ తరహా రచ్చ జరుగుతూ వస్తోందన్నది విశ్లేషకుల మాట.