ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఏలూరు, అల్లూరి జిల్లాలో మూడు రోజులపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఈదురుగాలులతో కూడిని భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిత్యవసర సరుకుల కోసం గిరిజనులు కర్రల సహాయంతో వాగులు దాటుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భీకర వరదలతో తీరం ప్రమాదకరంగా మారింది. ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 14 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు అధికారులు. అటు కోనసీమలో పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం పూర్తిగా నీట మునిగింది. గోష్పాద క్షేత్రంలో ఉన్న ఆన్ని ఆలయ సముదాయాల్లోకి వరద నీరు భారీగా చేరుతుంది.
ఇక ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో వదర విధ్వంసం ఆనవాళ్లు,… ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్నటి వరకు వరద నీటిలో ఉన్న గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది. సహాయ శిబిరాల్లో తలదాచుకున్న.. ముంపు బాధితులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ధ్వంసమైన ఇళ్లు, పాడైపోయిన సామాన్లు.. బురదతో నిండిన వాకిళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇళ్లలో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. టీవీ, ఫ్యాన్లు, మిక్సీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నీటిలో నానిపోవడంతో పనికి రాకుండా పోయాయి.
ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.