Annavaram Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం రత్నగిరిపై ఇద్దరు భక్తులు మద్యం సేవిస్తూ పట్టుబడిన వ్యవహారంలో ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. టోల్‌గేట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని నిర్ధారించుకున్న ఆలయ ఉన్నతాధికారులు.. ఆలయ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఆ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. శనివారం నాడు కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వచ్చిన యాత్రికులు బస్సులో కొండపైకి మద్యం బాటిళ్లను తరలించారు. ఈ క్రమంలోనే బస్సులో ఉండి ఇద్దరు యాత్రికులు మద్యం సేవిస్తుండగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆలయ ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. తొలుత ఘటనపై విచారణ జరిపి.. దీనికి బాధ్యుడిగా టోల్‌గేట్ అటెండర్‌ని చేసింది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ అటెండర్ నారాయణ రావును సస్పెండ్ చేస్తూ అన్నవరం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ప్రకటన విడుదల చేశారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం వరకు కూడా దేవాలయాలకు సంబంధించి తీవ్ర వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదాలు కాస్తా ప్రభుత్వ ప్రతిష్టనే దెబ్బతీస్తుండటంతో.. దీనిపై సర్కార్ నజర్ పెట్టింది. దేవాలయాలకు సంబంధించి ఏ చిన్న పొరపాటును కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేవాలయాల్లో సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతను మరింత పటిష్టం చేశారు.
Also read: