
ప్రకృతి సహజ సిద్ధ అందాల నిలయం అల్లూరి మన్యం.. ఎత్తయిన కొండలు లోయలు సుందర పర్యాటక ప్రదేశాలు ఉన్న ఈ ప్రాంతంలో.. మరో సుందర ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అదే పింక్ ఫారెస్ట్.. విదేశాలాంటి ప్రకృతి అనుభూతి కలిగించే ఆ ప్రాంతం ఇప్పుడూ టూరిస్టులను కట్టిపడేస్తోంది. ఆ సరికొత్త ప్రకృతి సహజసిద్ధ టూరిస్ట్ డెస్టినేషన్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. పచ్చని భారీ చెట్లు.. వాటికి అలంకరించేలా రంగురంగుల ఆకులు.. సువాసనలు వెదజల్లే పూలు..! ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే అటువంటి అందాలు చూసేందుకు విదేశాలకు వెళుతూ ఉంటారు. చాలా సినిమాల్లో అటువంటి సహజ సిద్ధ ప్రకృతి అందాలు చూస్తూ ఉంటాం. ఎంతోమంది సినీ డైరెక్టర్లు నిర్మాతలు.. అటువంటి సుందర ప్రాంతం కోసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి షూటింగ్ నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతాలు యూఎస్ యూరప్ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అటువంటి ప్రాంతం ఇప్పుడు అల్లూరి ఏజెన్సీలో కనువిందు చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎత్తయిన చెట్లకు రంగుల అద్దేలా ఆకులు, పూలు పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. దట్టంగా విస్తరించి ఉన్న ఆ చెట్లు ఇప్పుడు పింక్ ఫారెస్ట్ గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారం గరువు ప్రాంతం. హుకుంపేట మండలంలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ చెట్లు ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.. ఇవి నాగకేసరి చెట్లు.. ఉప్ప చెట్లు అని కూడా పిలుస్తారు. ఈ చెట్ల శాస్త్రీయ నామం ‘మెసువా ఫెర్రియా’. ఈ చెట్లకు చాలా ఏళ్లు గా ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చిన కొంతమంది పర్యాటకులు.. ఈ చెట్ల ప్రకృతి అందాలను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏజెన్సీ ప్రజలకు వెళ్లిన వాళ్ళు ఈ ఉప్ప చెట్ల గురించి తెలుసుకొని బంగారం గరువు గ్రామానికి వెళ్లి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు.
Pink Forest In Andhra
వాస్తవానికి.. ఈ ప్రాంతం చూస్తే రెండు కళ్ళు చాలవు. ఏరియల్ వ్యూలో కెమెరా కళ్ళతో ఈ ప్రాంత ప్రకృతి అందాలను షూట్ చేస్తే.. అబ్బా ఏముంది రా అని పర్యాటక ప్రేమికులు అనుకోక తప్పదు. కొంతమంది అయితే ఈ ప్రకృతి సోయగలకు ఫిదా అయి.. అచ్చం యూరప్ లో ఉన్నట్టుంది అని వైరల్ చేస్తున్నారు. దీంతో క్రమంగా ఈ ప్రాంతానికి టూరిస్ట్‌లో సంఖ్య పెరుగుతుంది.
ఇంతటి సుందరమైన ఈ ప్రాంతాన్ని గ్రామస్తులు స్వయంగా సంరక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ చెట్ల మధ్య గుణాలమ్మ తల్లి దేవతను ప్రతిష్టించారు. ఈ చెట్లను కూడా దైవంగా భావిస్తారు ఇక్కడ గిరిజనులు. ఎందుకంటే హిమాలయాల్లో ఉండే ఈ చెట్లు కేవలం బంగారం గురువులోనే విస్తరించడంతో దీనికి ఏదో మహిమ ఉందని భావిస్తున్నారు స్థానికులు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు ఎక్కడ తీసుకువెళ్లి నాటిన అవి బతకడం లేదు. కేవలం బంగారం గరువు లోనే దట్టంగా విస్తరిస్తున్నాయి. పర్యాటకులారా రండి.. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించండి. కానీ.. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాతోపాటు మీకు కూడా ఉంది.. అంటూ గ్రామస్తులు కోరుతున్నారు..
Uppa Trees
ఈ చెట్లకు మరో విశిష్టత కూడా ఉంది. మూడు నెలల కాలంలో ఆరు రంగులు మార్చే గుణం ఉంది. చెట్ల ఆకులు ఈ చెట్లను గిరిజనులు అమ్మవారి రూపంగా భావిస్తున్నారు. శీతాకాలం నుంచి.. ఈ చెట్ల ఆకులు క్రమంగా రంగులు మారుతూ ఉంటాయి. జనవరి నుంచి మార్చి వరకు కాలంలో ఈ ఆకుల రంగులు మారుతాయి. గోల్డెన్ కలర్, రెడ్, పింక్, గ్రీన్, వైట్ కలర్స్ లో ఆకులు క్రమంగా రంగు మారుతూ ఉంటాయి. మార్చి నుంచి మే వరకు సువాసన ఇచ్చే తెల్లని పువ్వులు పుస్తాయి. జూన్ నుంచి జులై వరకు కాయలు కాస్తాయి. ఈ కాయల నుంచి నూనె తయారు చేస్తామని స్థానిక గిరిజనులు అప్పారావు, నాగేశ్వరరావు టీవీ9తో చెప్పారు.
సహజ సిద్ధంగా రంగురంగులతో పింక్ ఫారెస్ట్ గా పేరుపొందిన ఈ నాగ కేసరి మొక్కలను పాడేరుకు తీసుకుని వచ్చింది ఒడిశాలోని జైపుర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ అని చెబుతుంటారు. ఏపీలో ఇలాంటి చెట్లు లేవని మరెక్కడా లేవని అంటున్నారు. ఈ చెట్టు కాయలను వెలిగించి దీపంలా వినియోగిస్తుంటారు. అందుకే వీటిని దివిటీ మొక్కలు కూడా అంటుంటారు. ఈ ప్రాంతంలో తప్ప ఈ ఉప్ప చెట్లు.. మరి ఎక్కడ ఏజెన్సీ ప్రాంతంలో లేవని అంటున్నారు. ఈ నాగ కేసరి చెట్లు భారతదేశం, శ్రీలంక, మలేషియాలో సాధారణంగా కనిపించే ఒక రకమైన సతత హరిత చెట్టు . ఈ చెట్టు పూల మొగ్గలు, విత్తనాలను వివిధ ఔషధ, వంట ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
Andhra’s Pink Forest
‘మిసియా ఫెర్రియా ను ఉప్పలో ఉన్నట్టు 2003లో ప్రొఫెసర్ ఎం వెంకయ్య తొలిసారిగా గుర్తించారు. జైపూర్ మహారాజు తన ప్రయాణంలో కాగడాలకు నూనె కోసం చెట్ల కాయలు వాడేందుకు వాటిని ఈ ప్రాంతంలో నాటినట్టు అటవీశాఖ ప్లానింగ్ బుక్స్ లో ఉన్నట్టు అధికారులు చెప్పారు. హిమాలయాల్లో పెరిగే ఈ చెట్లు శీతల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఉప్ప సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంది. దాంతోపాటు ఈ చెట్లను స్థానికులు దైవంగా భావిస్తారు. చెట్లను నరికే సాహసం ఎవరూ చేయరు. అందుకే ఈ ప్రాంతంలో దట్టంగా ఈ చెట్లు విస్తరించాయి. ఫిబ్రవరి మార్చి నెలలో కొత్త కొమ్మలు వచ్చి ఆకులు చిగురిస్తాయి. దీంతో ఎర్రగా ఈ చెట్లన్నీ కనిపిస్తాయి. ఈ చెట్ల మధ్య కొన్ని అంతరించిపోతున్న వృక్షజాతులు ఉన్నట్టు కూడా 2009-10 లో గుర్తించి పేపర్ రాశాను. ఈ చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది.’ అని ఏయూ బోటనీ ప్రొఫెసర్ ప్రకాశరావు టీవీ9తో చెప్పారు.
ఇప్పటికే అల్లూరి జిల్లాలో లంబసింగి వంజంగి మాడగడ వంటి సుందర ప్రదేశాలు.. జలపాతాలు, పర్యటక ప్రాంతాలు.. సందర్శకుల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పుడు బంగారం గురువు గ్రామంలో ఉండే ఈ నాగకేసరి చెట్లు విదేశాల్లోని పర్యటక ప్రాంతాల అనుభూతి కల్పిస్తూ సందర్శకులను రారమ్మని పిలుస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..