Vehicle Number Plate: ఇకపై కార్లు, ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్లపై చిలిపి రాతలు, సినిమా హీరోల ఫోటోలు కనిపిస్తే వాహనదారులకు చుక్కలు చూపిస్తామంటున్నారు పోలీసులు. ఇష్టానుసారంగా నెంబర్లు వేయించుకోవడం, అంకెలు మార్చడం లాంటివి చేస్తే చర్యలు తప్పవంటున్నారు రవాణా శాఖ అధికారులు. 2015 తర్వాత కొన్న వాహనాలకు హై సెక్యురిటి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక జీవోను జారీచేసింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సీసీ కెమెరాల ద్వారా వాహనదారులు వివరాలు దొరకకుండా చాలామంది నెంబర్ ప్లేట్ పై నెంబర్లు గుర్తించకుండా రకరకాల డిజైన్లు పేర్లు, స్టిక్కర్లతో తప్పించుకుంటున్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటివరకు చూసి చూడనట్లు వదిలేసినా ఇకపై నిబంధనలు పాటించని వాహనదారులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలు తప్పవు హెచ్చరిస్తున్నారు పోలీసులు.
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విధానం కేవలం సాధారణ పౌరులకే కాదు.. ప్రభుత్వ అధికారులు వినియెగించే వాహనాలకు కూడా వర్తిస్తుందంటున్నారు రవాణా శాఖ అధికారులు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా హోదాను తెలిపే పేర్లను నెంబర్ ప్లేట్లపై వినియోగిస్తే వారు కూడా జరిమానా నుంచి తప్పించుకోలేరు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుగా ప్రభుత్వ వాహనాల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.
కాగా, రాష్ట్రంలో 40 శాతం వాహనాల్లో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ లేకుండానే నడుస్తున్నాయి. వాహనాలు విక్రయాలు జరిపిన డీలర్లే ఈ నెంబరు ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని డీలర్లపై కూడా చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రవాణాశాఖ అధికారులు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించనివారిపై తొలుత రూ. 2,500 జరిమానా విధిస్తున్నారు. ఏపీలో 100 శాతం వాహనాలు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ వాహనాలుగా మార్చే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి: