
2016లో జరిగిన ఈ ఘటన.. ఉమ్మడి గుంటూరు జిల్లాను షాక్‌కు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో వేముల శ్రీసాయి షణ్ముఖ్ అనే యువకుడిని.. చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు కొందరు వ్యక్తులు. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు నిందితులకు శిక్షపడింది. 13మందికి జీవిత ఖైదు విధిస్తూ.. సంచలన తీర్పునిచ్చింది తెనాలి న్యాయస్థానం. ఇంతకీ షణ్ముఖ్‌ను ఎందుకు చంపారంటే… ప్రేమించడమే అతను చేసిన తప్పు. అవును.. జాస్మిన్‌ను ప్రేమించడమే శ్రీసాయి చేసిన ఘోరమైన తప్పు. 2016 జులై 17న జాస్మిన్ ఫోన్ చేస్తే .. ఆమె ఇంటికి వెళ్లాడు. జాస్మిన్‌తో కాసేపు మాట్లాడి వచ్చేశాడు. ఆ విషయం తెలిసి.. కుటుంబ సభ్యులు జాస్మిన్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. ఉరేసుకుంది. అంతకు ముందే శ్రీసాయికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పింది. హడావుడిగా అతను జాస్మిన్ ఇంటికి వెళ్లినా.. అప్పటికే జాస్మిన్ చనిపోయింది.
దీంతో, తమ కుమార్తె మరణానికి నువ్వే కారణమంటూ.. జాస్మిన్ కుటుంబసభ్యులు శ్రీసాయి, పవన్‌కుమార్‌లను కట్టేశారు. కళ్లలో కారం చల్లి.. దాడి చేశారు. బట్టలు విప్పేసి చెట్టుకు కట్టేసి మూకదాడి చేశారు. పోలీసులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. తీవ్రంగా గాయపడిన వారికి.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అదనపు పోలీసు బలగాలు వచ్చాక.. యువకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో శ్రీసాయి చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనమే రేపింది.
శ్రీసాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెనాలి 11వ అదనపు జిల్లాకోర్టులో విచారణ పూర్తి చేసి.. తుదితీర్పు వెలువరించారు న్యాయమూర్తి మాలతి. ఈ కేసుకు సంబంధించి మొత్తం 21 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే మృతి చెందగా.. సరైన ఆధారాలు లేని కారణంగా మరో నలుగురు మహిళలను విడుదల చేశారు. 13 మందిని దోషులుగా తేల్చిన కోర్టు… జీవిత ఖైదు విధించింది.
అయితే, దోషులకు శిక్షపడినా.. యువకులపై దాడిని నిలువరించి ప్రాణాలు కాపాడటంలో విఫలమయ్యారనే విమర్శలు మాత్రం పోలీసులు ఎదుర్కోక తప్పలేదు. అప్పట్లో అడవులదీవి ఎస్‌ఐపై చర్యలు కూడా తీసుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..