పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియలో తాజా పరిణామాలపై అత్యవసరంగా కలుగజేసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖలో కౌంటింగ్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల విషయంలో అధికారపార్టీ అనుచిత చర్యలకు దిగిందని, టీడీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలపివేశారని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారని, సీఎం నుంచి, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
కాగా, పశ్చిమ రాయలసీమ నేతలతో చంద్రబాబు నాయుడు అత్యవసరంగా మాట్లాడారు. సీఎంవో నుంచి తీవ్ర స్థాయి ఒత్తిళ్లతో డిక్లరేషన్ ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. సీఎం సొంత జిల్లా ఉన్న సీటు పోయిందనే కారణంగా చివరి నిముషం లో అక్రమాలకు తెరతీసారని చంద్రబాబుకు నేతలు తెలిపారు. ఫలితాల వెల్లడి తరువాత డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు జాప్యం పై టీడీపీ ఆరోపిస్తోంది. విషయం తేలేవరకు నేతలు పోరాటం చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఎందుకివ్వరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ గెలుపును ప్రజలు డిక్లేర్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపడానికి జగన్ ఎవరు? ఆర్వో ఎవరు? అంటూ మండిపడ్డారు. వైసీపీని ప్రజలు చీకొట్టినా జగన్ మాత్రం తన అరాచక పాలన తీరును మార్చుకోవటం లేదని ధ్వజమెత్తారు. రాంగోపాల్ రెడ్డికి వెంటనే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి