Andhra Pradesh: ప్రస్తుత కాలంలో మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు. సాధారణ బంధుత్వాలనే కాదు.. రక్త సంబంధాలను సైతం లక్ష్య పెట్టడం లేదు. ఆఖరికి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను.. బ్రతికుండగానే చంపేస్తున్నారు. ఆస్తుల కోసం దారుణాతి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఆస్తుల కోసం ఎంతటి దారుణాలకైన ఒడిగట్టే కొడుకుల నిర్వాకం బట్టబయలైంది. ఆస్తి కోసం బతికున్న తండ్రికి డెత్ సర్టిఫికెట్ తీశారు ఈ సుపుత్రులు. ప్రపంచలోనే ఎవరూ చేయని నిర్వాకం చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. తండ్రి బతికున్నా.. చనిపోయాడంటూ ఓ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించి ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. ఈ దుర్మార్గపు కుమారుల అక్రమ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లాలో బతికున్న తండ్రిని చంపేశారు కొడుకులు. అవుకు మండలం వేములపాడుకు చెందిన తిమ్మయ్యకు ఇద్దరు భార్యలు.. మెదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. నంద్యాలలో నివాసం ఉంటున్నాడు. అవుకు మండలం వేములపాడులో ఆయనకు 5.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే మొదటి భార్య ముగ్గరు కుమారులు ఈ భూమిపై కన్నేశారు. ఈ క్రమంలోనే తిమ్మయ్య మరణించినట్లుగా ధ్రువపత్రం తీశారు. దాని ఆధారంగా.. అవుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తిమ్మయ్య పేరిట ఉన్న ఆస్తిని ముగ్గురు కొడుకులు తమ పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే, తిమ్మయ్య తాజాగా పొలం పేరిట బ్యాంకు రుణం తీసుకునే క్రమంలో ఈసీ తీయగా.. అసలు విషయం బయటపడింది. ఆస్తికి సంబంధించి తిమ్మయ్య పేరుకు బదులుగా.. అతని ముగ్గురు కుమారుల పేర్లు వచ్చాయి. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే.. బ్రతికున్న తన పేరిట డెత్ సర్టిఫికెట్ తీసుకుని భూమిని వారి పేరిట మార్పించుకున్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన తిమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read: