YSRCP: వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. వారు ఎవరెవరంటే..?

|

Mar 24, 2023 | 5:56 PM

ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారపార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులను సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యే ఎమ్మె్ల్సీ సీటు విషయంలో క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గతంగా దర్యాప్తు చేసిన వైసీపీ.. ఆనం, మేకపాటి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని..

YSRCP: వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. వారు ఎవరెవరంటే..?
Ycp Mlas
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అంతకముందు క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపిన వైసీపీ.. ఆనం రామనారాయణరెడ్డి, మేకపటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించి, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తున్నాం. ఈ నలుగురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించింది. క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్‌ చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు’ అని ఎమ్మెల్యే సజ్జల మీడియాకు వివరించారు. ‘గడప గడప రిపోర్టుతో పాటు గెలవని ఎమ్మెల్యేలను గుర్తించి జగన్ ముందే హెచ్చరించారు. గెలవని వారికి చివరి నిమిషంలో చెప్పకుండా ముందే టిక్కెట్లు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఈ కారణంగానే ఈ నలుగురు పార్టీ లైన్ దాటార’ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ‘ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వారెవరూ పార్టీ లైన్ దాటలేదు. సీటు లేకపోతే రాజకీయం లేదని కొద్ది మంది భావిస్తున్నారు. అలాంటి వారే ఇలా చేస్తారు. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఆఫర్ చేసి ప్రలోభాలకు గురుచేసిన చంద్రబాబు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మా పార్టీ అంతర్గతంగా చేసిన విచారణలో అన్ని ఆధారాలు గుర్తించినందువల్లే నిర్ణయం తీసుకున్నాం. పార్టీ నుంచి ప్రకటన కూడా విడుదల చేస్తాం. డబ్బుకు అమ్ముడుపోయారనేదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర డబ్బులెక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఇలాంటివి చేస్తుంటాడు. సంతలో సరుకులను కొన్నట్లు కొనడానికి సిద్ధంగా ఉంటాడు. గతంలో ఓటుకునోటు కేసులో బ్రీఫ్డ్ మీ అనే దొరికిపోయాడు. ఆయన వ్యవహారశైలికి తగ్గట్లే చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’ అని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..