AP Corona cases Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వికృతరూపం కొనసాగుతూనే ఉంది. నిత్యం పరీక్షలు పెరిగే కొద్దీ కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. అంతే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా కరోనా వైరస్ ధాటికి తాళలేక మరో 73మంది ప్రాణాలను కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు.
ఏపీలో కరోనా కేసులు, తాజా పరిస్థితిపై శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. అదే విధంగా కొవిడ్ విధుల్లోని సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత కారణంగా మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోస్ టీకాలు తీసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. త్వరలో మరో 3.50లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో దాదాపు రూ.180 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇక, ఇవాళ నమోదైన తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,71,60,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కోవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,519 మృత్యువాతపడ్డారు.
కాగా, తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 10,50,160మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు 2,260 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారిన పడ్డారు.
ఇక, వివిధ జిల్లాల కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…
Read Also…. Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యాధికారులకు పలు సూచనలు