Andhra Pradesh: విశాఖలో విచిత్ర దొంగ.. బైక్ చోరీ చేసి యజమానికే ఫోన్ చేశాడు.. కట్ చేస్తే కథ వేరే లెవల్లో..

|

Jul 17, 2022 | 12:28 PM

Andhra Pradesh: సాధారణంగా దొంగలు అంటే ఎలా ఉంటారు?! తాము చేసిన పని మూడో కంటికి తెలియకుండా చేసి అనుకున్న పని పూర్తి చేస్తారు.

Andhra Pradesh: విశాఖలో విచిత్ర దొంగ.. బైక్ చోరీ చేసి యజమానికే ఫోన్ చేశాడు.. కట్ చేస్తే కథ వేరే లెవల్లో..
Thieve
Follow us on

Andhra Pradesh: సాధారణంగా దొంగలు అంటే ఎలా ఉంటారు?! తాము చేసిన పని మూడో కంటికి తెలియకుండా చేసి అనుకున్న పని పూర్తి చేస్తారు. చోరీ సొత్తును ఎత్తుకెళ్లి.. పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా పోతారు. పోలీసులకు సైతం అంతుచిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతుంటారు. కానీ విశాఖలో మాత్రం వెరైటీ దొంగ.. విచిత్రంగా మారాడు. బైకును కొట్టేసి.. ఆ తర్వాత యజమానికే ఫోన్ కాల్ చేసాడు. అడ్డంగా బుక్కై కటకటాల వెనక్కు వెళ్ళాడు. ఇంతకీ ఆ దొంగ ఆ పని ఎందుకు చేశాడు..? వాడి వ్యవహారం ఎలా ఉంటుంది..? ఒకసారి తెలుసుకుందాం.

వివరాల్లోకెళితే.. విశాఖ వడ్లపూడి రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పడాల వినయ సాయి అనే యువకుడు.. ర్యాపిడో బైక్ పైలట్ గా పనిచేస్తున్నాడు. వచ్చిన ఆదాయంతో జీవనం సాగించేవాడు. అప్పుల పాలవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు.

ఇదిలాఉంటే.. గాజువాక శ్రామిక నగర్‌లో ఉంటున్న రమేష్ తన బైకును పార్క్ చేశాడు. ఈనెల ఒకటో తేదీ రాత్రి 10:30 ప్రాంతంలో పార్కింగ్ చేసిన ఆ బైక్ ఉదయానికి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన రమేష్.. చోరీ జరిగి ఉంటుందని అనుమానించాడు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో బాధితుడు రమేష్ కు ర్యాపిడో పైలట్ నంటూ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా.. ట్రాక్ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఆ బైక్ చోరీ చేసిన దొంగ ఎవడో కాదు.. పడాల వినయ్ సాయి.

ఇవి కూడా చదవండి

వినయ్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు బైకును సీజ్ చేశారు. దీంతో పాటు మరో ఎనిమిది బైకులను కూడా దొంగతనం చేసినట్టు గుర్తించారు పోలీసులు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, దువ్వాడ పీఎస్ పరిధిలో మూడు, ఫోర్త్ టౌన్ పరిధిలో మరొకటి, ఎయిర్పోర్ట్ కంచరపాలెం పిఎస్ ల పరిధిలోను ఒక్కో బైక్ ను దొంగతనం చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు. ఆయా బైకులను కూడా రికవరీ చేశారు గాజువాక క్రైమ్ పోలీసులు.

బైక్ యజమానికి కాల్ ఎందుకు చేశాడు..?
గత కొన్ని రోజులుగా విశాఖ నగర పరిధిలో బైక్స్ చోరీకి గురవుతున్నాయి. పార్కింగ్ లో ఉన్న బైక్స్ పై కన్నేస్తున్న సాయి.. వాటిని తన దగ్గర ఉన్న మారు తాళంతో తస్కరిస్తున్నాడు. అప్పటివరకు 7 బైకులను చోరీ చేసినన వినయ్ సాయి.. ఎనిమిదో బైక్ చోరీ చేసి చిక్కిపోయాడు. తనే పోలీసులకు దొరికేలా తప్పు చేశాడు. ఎలా అంటే.. రమేష్ బైక్ ను దొంగలించిన వినయ్ సాయి.. ఆ మరుసటి రోజు బైక్ యజమానికి ఫోన్ కాల్ చేసాడు. ‘నేను ర్యాపిడో నుంచి కాల్ చేస్తున్నాను మీరు రైడ్ బుక్ చేసుకున్నారు కదా.. నేను ఎక్కడికి రావాలి’ అని ఆ కాల్ సారాంశం. దీంతో అవాక్కైనా రమేష్.. తాను రైడ్ బుక్ చేయలేదు అని.. పోయిన తన బైక్ కోసం వెతికే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. దీంతో మాటల్లో మాట కలిపిన నిందితుడు.. తాను బైక్ ను వెతికి పెడతానని.. అందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు వినయ్ సాయి. అప్పటికే బైక్ పోయిన ఆందోళనలో ఉన్న రమేష్.. నిరాకరించి ఫోన్ పెట్టేశాడు. ఒక గంట తర్వాత తనకు వచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ కాల్ చేశాడు బాధితుడు రమేష్. ఆ ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ బండారం బయటపడింది. బైక్‌ లను అమ్మితే డబ్బులు వస్తున్నాయో రావడం లేదో, మరి అత్యాశ పెరిగిందో ఏమో గాని.. దొంగతనం చలాకీగానే చేసినా.. తను చేసిన చిన్న పొరపాటు అతన్ని పోలీసులకు పట్టించింది. అదే పోలీసులు కూడా చెబుతుంటారు… ఎంత తెలివైన దొంగ అయినా సరే ఏదో ఒక ఆధారంతో అయినా, చిన్న తప్పు చేసిన పోలీసులకు చిక్కిపోవడం ఖాయం.

– ఖాజా, వైజాగ్, టీవీ9 తెలుగు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..