పల్నాడు జిల్లాలో వైసీపీ సమన్వయకర్తల మార్పులు చేర్పులు మొదలయ్యాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీని మార్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగుతుంది. ఎమ్మెల్యేలు కూడా ఈ మార్పుపై ఆశ్చర్య వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ మార్పుపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ముప్పై ఐదేళ్లకే ఎంపీ. తండ్రికి సాధ్యం కానిది ఆయన చిన్న వయస్సులోనే సాధించారు. అయితే తిరిగి పోటీ చేసే అంశంపై మాత్రం సందిగ్థత నెలకొంది.విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట నుండి పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి గెలుపొంది రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టారు.
అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు నర్సరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని అధిష్టానం చెప్పడంపై ఎంపీ కినుక వహించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పేట ఎంపీగానే పోటీ చేసేందుకు ఆయన సిద్దం మయ్యారు. అనూహ్యంగా ఆయన్ను గుంటూరు వెళ్లాలని చెప్పడంతో ఖంగుతిన్నారు. అయితే అధిష్టానం నిర్ణయం వెనుక ఎంపీ స్వయంకృతాపరాధం కూడా ఉన్నట్లు ప్రచారం జరగుతుంది. ఎంపీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలతో పొసగలేదట. ముఖ్యంగా మంత్రి విడదల రజినిని ఆయన బాహాటంగానే విబేధించారు. గత నాలుగేళ్లలో ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పరిస్థితి కూడా లేదట.
ఇక వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కూడా ఎంపీ విబేధించారు. తనకు వ్యతిరేకంగా మరొక వర్గాన్ని ఎంపీ ప్రోత్సహిస్తున్నారని బొల్లా అధిష్టానానికి గతంలో ఫిర్యాదు చేశారు. మరొక ఎమ్మెల్యే సీనియర్ నేత అంబటి రాంబాబుతోనూ ఎంపీ సత్సంబంధాలు లేవు. ఇక మిగిలిన ఎమ్మెల్యలతో కలిసి పనిచేస్తున్నా వచ్చే ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎంపీ గ్యాప్ రావడం మంచిది కాదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ అభ్యర్ధిగా బిసిని బరిలోకి దించే ఆలోచన కూడా అధిష్టానం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ కొంత రిజర్వ్డ్ గా ఉండటం, గతంలో టీడీపీలోకి వెళుతున్నట్ల ప్రచారం జరగటం కూడా ఆయనకు మైనస్‌గా మారాయి.
మొత్తం మీద ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పు ఉంటుందని ప్రచారం జరగుతున్న సమయంలో ఏకంగా ఎంపీనే మార్చడం మాత్రం జిల్లా నేతలకు అంతుచిక్కని వ్యవహారంగా మారిపోయింది. ఒక్క ఎంపీ స్థానంతోనే మార్పు ఆగుతుందా..? లేక ఎమ్మెల్యేల స్థానంలో కూడా మార్పు ఉంటుందా ? అని కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పల్నాడు జిల్లాలో మార్పులు చేర్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…