Andhra Pradesh: వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. వైవీ సుబ్బారెడ్డికి లేఖ.. అసలు కారణం వేరే ఉందని టాక్..!
Andhra Pradesh: విశాఖ వైసీపీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కలకలం రేపారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే గా గెలిచి వైసీపీ పంచన చేరిన వాసుపల్లి గణేష్..

Andhra Pradesh: విశాఖ వైసీపీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కలకలం రేపారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే గా గెలిచి వైసీపీ పంచన చేరిన వాసుపల్లి గణేష్.. పార్టీకి ఊహించని షాకిచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విశాఖ-అనకాపల్లి-మన్యం జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి తన నిర్ణయాన్ని తెలియజేశారు వాసుపల్లి గణేష్. వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాసిన వాసుపల్లి గణేష్, తన నిర్ణయం వెనక కారణాలను వివరించారు. ప్రాంతీయ సమన్వయకర్తగా విశాఖ వచ్చిన మొదటిరోజే తనకు శల్య పరీక్ష పెట్టడం బాధించిందన్నారు. తన గౌరవానికి భంగం కలిగినట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు జరిగిన పంచాయితీకి చింతిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు వాసుపల్లి గణేష్.
వైవీకి రాసిన లేఖలో ఇంకా చాలా విషయాలను ప్రస్తావించారు గణేష్. జగన్ హవాను సైతం తట్టుకుని గెలిచాను. అలాంటి తాను మీ ముందు బల నిరూపణ చేసుకోవాల్సి రావడం తనను అవమానించడమేనన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుంచి వాసుపల్లి గణేష్ వైదొలగడం వెనక కథే నడిచినట్లు తెలుస్తోంది. వాసుపల్లి లేఖలోని అంశాలను చూస్తే అది స్పష్టంగా కనిపిస్తోంది. తనను అనుమానించారని, అవమానం జరిగిందంటూ అనేక రీజన్స్‌ను లేవనెత్తిన గణేష్… ఫైనల్‌గా వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు తెలిపారు. సమన్వయకర్త పదవి నుంచి తప్పుకున్నా, పార్టీకి బద్ధుడినై పనిచేస్తానంటూ చివర్లో రాయడం మాత్రం వాసుపల్లి లెటర్‌లో హైలేట్ పాయింట్. అయితే, వాసుపల్లి గణేష్ మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయ్. అందుకే, వైసీపీ కూడా వాసుపల్లి వ్యవహారాన్ని లైట్ తీసుకుంటుందని అంటున్నారు. టీడీపీలో చేరడానికి సిద్ధపడే గణేష్ అలా చేస్తున్నారని ఆరోపిస్తోంది అతని ప్రత్యర్ధి వర్గం. మరి, వాసుపల్లి గణేష్ ముందుముదు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
