
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేయాలని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై స్పందించిన అంబటి.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారు. ‘పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపారు. ప్రతిఫలంగా కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. పవన్ కూడా తన అన్న లాగే జనసే పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలి. పవన్ కు బాబు ఏదో ఒక పదవి ఇస్తారు.’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు అంబటి.
తెలుగుదేశం పార్టీకి బీటీమ్ జనసేన అని విమర్శించారు మంత్రి. టీడీపీ, జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కావన్నారు. టీడీపీని కాపాడేందుకు జనసేన పుట్టిందన్నారు. పవన్, చంద్రబాబు భేటీలో చర్చించింది ప్రజాస్వామ్యం గురించి కాదని, టీడీపీ పరిరక్షణ గురించి మాట్లాడుకున్నారని విమర్శించారు అంబటి. ఈ రెండు పార్టీలు కలిసి వస్తాయని ఎప్పుడో చెప్పామని గుర్తుచేశారు మంత్రి. 11 మంది చనిపోవడంతో ఇద్దరూ స్పందించలేదని ఫైర్ అయ్యారు. పవన్-బాబు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ ఇద్దరి మధ్య నాదెండ్ల మనోహర్ బ్రోకరిజం చేస్తున్నారంటూ తీవ్ర కామెంట్స్ చేశారు మంత్రి అంబటి.
ఇదే సమయంలో కాపులు మోసపోవద్దంటూ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. పవన్ మాటలు విని చంద్రబాబు పల్లకి మోయకండని కోరారు మంత్రి. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కలలు కంటుంటే.. పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని కలలు కంటున్నారని అన్నారు. పవన్ వల్ల కాపులకు జరిగేదేమీ ఉండదన్నారు. కాపుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు మంత్రి అంబటి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..