అదిగో పులి ఇదిగో పులి అంటూ అటు కాకినాడ జిల్లా వాసులు నెలరోజుల నుంచి బెంబేలెత్తిపోతున్నారు. ఇటు.. సిక్కోలు జిల్లాను మాత్రం ఎలుగుబంటి భయం అంతే భీకరంగా వెంటాడుతోంది. ఎప్పుడొస్తుందో తెలీదు.. ఎటునుంచి వస్తుందో తెలీదు.. ఒక్కసారిగా దాడి చేసి… ప్రాణాలు తీస్తోంది మాయదారి ఎలుగుబంటి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు… పగలు రాత్రీ తేడా లేదు అక్కడి జనం భయంతో వణికిపోతున్నారు. సమీపంలోని అడవుల్లోంచి ఊర్లోకొచ్చి.. మీరే నా టార్గెట్ అంటూ వెంటాడుతోంది ఒక ఎలుగుబంటి. ఇవాళ ఎటాక్ చేసి భయానక వాతావరణం సృష్టించింది. కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం చేసింది. గ్రామంలో దాదాపు ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎలుగుబంటి దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
నెత్తురోడుతున్న బాధితుల్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీళ్లలో ఆరుగురి పరిస్థితైతే విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. చూడ్డానికే వణికేంతగా ఉన్నాయి వాళ్ల వంటి మీది గాయాలు. మీద పడి బాకుల్లాంటి పండ్లతో కొరికి పడేశాయని.. దాన్నుంచి తప్పించుకోడానికి నానా యాతనా పడ్డామని చెబుతున్నారు బాధితులు.
ఇటీవల ఒక ఎలుగుబంటి చేసిన దాడిలో కోదండరాం అనే రైతు తీవ్రంగా గాయపడి… ఆ తర్వాత మృతిచెందాడు. ఇప్పుడు మళ్లీ అటువంటి దాడే జరిగింది. వజ్రకొత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎలుగుబంటి దాడి అనేది చాలా సహజంగా మారింది. వరుసగా సంభవిస్తున్న ఘటనలతో బెంబేలెత్తుతున్నారు అక్కడి జనాలు. అటవీ శాఖ అధికారులు తమ గోడు వినడం లేదని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తమకీ కష్టాలని వాపోతున్నారు స్థానికులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి