Andhra Pradesh: శివుడు పిలిచాడని యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ లెటర్‌లో షాకింగ్ విషయాలు..

|

Sep 25, 2022 | 8:14 PM

Andhra Pradesh: ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆర్థిక కష్టాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ, చదువు, ఉద్యోగం..

Andhra Pradesh: శివుడు పిలిచాడని యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ లెటర్‌లో షాకింగ్ విషయాలు..
Suicide Letter
Follow us on

Andhra Pradesh: ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆర్థిక కష్టాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ, చదువు, ఉద్యోగం ఇలా రకరకాల కారణాలతో నిత్యం ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడుతున్నాయి. అయితే, ఇక్కడ ఓ యువకుడు మాత్రం ఈ పాడు సమాజంలో ఉండొద్దన్నాడని, శివుడు తనను పిలుస్తున్నాడని చెప్పి ఆత్మార్పణం చేసుకున్నాడు. అవును.. శివుడు పిలుస్తున్నాడని ఆ యువకుడు తనువుచాలించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాట్లమడ గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర్ రెడ్డికి శివుడు అంటే ప్రాణం. ఎక్కడలేని భక్తిభావం. ఇప్పటికే తండ్రి చనిపోయాడు. తల్లికి, చెల్లికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు గానీ, చెన్నై నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. శివయ్య పిలుస్తున్నాడంటూ ఓ సూసైడ్‌ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ప్రేమ వంటి వ్యవహారాలు లేవని స్పష్టం చేశాడు. తాను పిరికివాడిని కాదని, ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని, అందుకే చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. తన తండ్రి కూడా శివయ్య దగ్గరే సేవ చేస్తున్నందున అక్కడికే వెళ్ళిపోతున్నానని పేర్కొన్నాడు. వచ్చే జన్మలో సమాజానికి మేలు చేసేందుకు అవకాశం కల్పించాలని శివయ్యను వేడుకుంటానని నోట్‌లో రాశాడు. చనిపోతూ తన చెల్లెలు సాయిలక్ష్మిని బంధువులంతా బాగా చూసుకోవాలని కోరాడు. ఆస్తులన్నీ తన చెల్లెలి పేరుతో రాయాలని, మంచి వరుణ్ణి చూసి పెళ్ళి చేయాలని సూచించాడు. ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న తనకు ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం శివయ్య పిలుస్తున్నందునే సూసైడ్‌ చేసుకుంటున్నట్టు రాశాడు. ఈ ఘటనతో చాట్లమడ గ్రామంలోని శేఖర్‌రెడ్డి కుటుంబం తల్లడిల్లిపోతోంది. శేఖర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం శివయ్య పిలుపే అని రాసిన సూసైడ్‌ నోట్‌ చూసి నమ్మలేక పోతున్నారు. కాగా, శేఖర్ రెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..