మరోసారి ఉద్యమ శంఖారావం పూరించింది ఏపీ ఉద్యోగుల జేఏసీ. ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం మూడో దశ ఉద్యమకార్యాచరణ ప్రకటించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మెసైరన్ మోగించింది.
ఏపీలో మరోసారి ఉద్యమ కార్యచరణ ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించింది అమరావతి జేఏసీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మూడో దశ ఉద్యమానికి సంసిద్ధమైంది. ఇప్పటికే గత 53 రోజులుగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. 22 తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. తాము నల్లబ్యాడ్జీలు ధరించే ఉంటామని.. 8వ తేదిన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. 9వ తేది నుండి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. మొదటి సదస్సును శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తామని.. ఈ సదస్సుకు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా ఉద్యోగులు హాజరవుతారన్నారు.
మే 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉద్యోగుల ఆవేదన చెబుతామనే కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు, 25 ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. రెండో ప్రాంతీయ సదస్సు అనంతపురం, మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో నిర్వహిస్తామన్నారు. మే 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేపడతామన్నారు. నాలుగో ప్రాంతీయ సదస్సు గుంటూరులో చేస్తామని తెలిపారు. నెలరోజుల నిరసనోద్యమ మాసంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..