విజయవాడలో ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాల నడుమ బృందాలుగా విడిపోయి.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేస్తోన్న అధికారులు.. పాయింట్ టు పాయింట్ కూపీ లాగుతున్నారు. బెజవాడలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు దడ పుట్టిస్తున్నాయి. రెండు రోజులుగా నాన్‌స్టాప్‌గా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు బాంబే జువెల్లర్స్.. ఇంకోవైపు ఆంజనేయ జువెలర్స్ షోరూమ్‌లలో మెరుపు సోదాలు చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయారు. రెండు షోరూమ్‌లలో ఎంట్రీ ఇచ్చి షట్టర్‌లు క్లోజ్ చేశారు. నో సేల్స్ బోర్డ్ తగిలించి మరీ డాక్యుమెంట్ల పరిశీలనలో మునిగిపోయారు. షోరూమ్‌లో పనిచేసే సిబ్బందిని బయటకు పంపించి.. అకౌంటెంట్లు, మేనేజర్ల సమక్షంలో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. తవ్వేకొద్ది అక్రమాల డొంక కదులుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గంటల తరబడి తనిఖీలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. పరిస్థితి చూస్తుంటే మరో రెండు రోజుల పాటు సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా రెండు షోరూమ్‌లో నిర్వాహకులు బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీటిపైనే అధికారులు ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. గోల్డ్ క్రయ విక్రయాలకు సంబంధించి సాఫ్ట్, హార్ట్ కాపీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి లెక్కలను అడిగి తెలుసుకుంటున్నారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు.. సిబ్బంది చెబుతున్న సమాధానాలకు పొంతన లేకపోవడాన్ని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. సీజ్ చేసిన కీలక డాక్యుమెంట్లపైనా కూపీ లాగుతున్నారు. విచారణలో హైదరాబాద్‌కు చెందిన జువెల్లర్ సంస్థల పాత్ర కూడా బయటపడినట్టు తెలుస్తోంది. ఆ దిశగానే ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మొత్తానికి రోజుల తరబడి ఐటీ అధికారుల తనిఖీలు.. వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..