AP Degree Online Admissions: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సీట్ల భర్తీపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. విద్యార్థుల అడ్మిషన్స్ అలాట్మెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 వరకు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మంగళవారం జీవో నెంబర్ 55పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లు కేటాయించి.. వాటిని కూడా కన్వీనర్ కోటాలో నింపడంపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యాజమాన్య కోటా కోరని కాలేజీలకు వెసులుబాటు ఇవ్వకపోవడంపై రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.
డిగ్రీ కాలేజీల అసోసియేషన్ పిటిషన్‌ను హైకోర్టు లంచ్ మోషన్‌గా స్వీకరించిన ధర్మాసనం విచారణ చేట్టింది. జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఎదుట విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమిల్లి విజయ్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 20 వరకు సీట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.. ఈ కేసుకు సంబందించి తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.