
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు దసరా సెలవులపై సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం (సెప్టెంబర్ 19) ప్రకటించారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వవల్సి ఉంది. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తాజా ప్రకటన మేరకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీంతో దసరా సెలవులు కూడా అదనంగా 2 రోజులకు పెరిగాయి. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 9 రోజులు మాత్రమే సెలవులు రాగా.. తాజా మార్పుతో వీటి సంఖ్య 11 రోజులకు చేరింది.
సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరడం వల్ల ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇక అక్టోబర్ 3వ తేదీన మళ్లీ పాఠశాలలన్నీ రీ ఓపెన్ కానున్నాయి. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో యథావిదిగా ఇవే తేదీలు కొనసాగనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి మొత్తం 6 రోజుల వరకు దసరా సెలవులు ఇచ్చారు.
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
— Lokesh Nara (@naralokesh) September 19, 2025
నిజానికి, సెప్టెంబర్ 3వ తేదీన స్కూల్ రీఓపెన్ ఉన్నప్పటికీ.. సెప్టెంబర్ 5న మిలాడ్ ఉన్ నబీ పండగ, సెప్టెంబర్ 7న ఆదివారం, సెప్టెంబర్ 13న రెండో శనివారం, సెప్టెంబర్ 14న ఆదివారం, సెప్టెంబర్ 21న ఆదివారం.. ఇలా ఈ నెలలో విద్యార్ధులకు వరుస సెలవులు రానున్నాయి. ఈ ఐదు రోజుల సెలవులు కూడా కలిపితే సెప్టెంబర్‌లో దాదాపు రెండు వారాల పాటు సెలవులు రానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.