YSR Matsyakara Bharosa scheme funds : ఆంధ్రప్రదేశ్‌లో గంగ పుత్రులు సహా ఇతర వర్గాలకు కూడా ఇవాళ ‘మత్స్యకార భరోసా’ సొమ్ములు చేతికందనున్నాయి. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’ కింద ఈ ఏడాది మరింత మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తంగా 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ. 119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా సొమ్ములు జమ చేయనున్నారు. గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. ఇలా ఉండగా, గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.