Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అఖిలభారత సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనలకు సంబంధించి జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడర్‌లోని అఖిలభారత సర్వీసు అధికారుల వ్యక్తిగత పని తీరును సమీక్షించే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికలను ఇక నుంచి ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ ఉత్తర్వుల్లో ఏం ఉందంటే..
అఖిలభారత సర్వీసు నిబంధనలు 2007 ప్రకారం అధికారుల పనితీరు, స్వభావం, ప్రవర్తన తదితర అంశాలను సమీక్షించే అధికారం ఇకమీదట ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. సబ్ కలెక్టర్ నుంచి సీఎస్ వరకు, ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు, సబ్ డీఎఫ్ఓ నుంచి పీసీసీఎఫ్ ఉప అటవీ అధికారి, ముఖ్య అటవీ సంరక్షణాధికారి వరకూ అందరి పనితీరు నివేదికలను ఆమోదించే అధికారం సీఎంకు ఉంటుందని తాజా జీవో స్పష్టం చేశారు. ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లోని వేర్వేరు హోదాలు, ర్యాంకులకు సంబంధించిన రిపోర్టింగ్ అధికారులు ఉన్నప్పటికీ పనితీరు నివేదికలను మాత్రం సీఎం మాత్రమే ఆమోదిస్తారని తాజా ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టంచేశారు.
అయితు, పౌర సేవలు మరింతగా ప్రజలకు చేరటం, పాలనాయంత్రాంగంపై నియంత్రణ లాంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. అయితే, ఒక్క గవర్నర్ కార్యదర్శికి సంబందించిన పనితీరు నివేదికను మాత్రమే రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులు.. సర్వీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, కేంద్ర సర్వీసుల వంటి అంశాల్లో అధికారులకు కీలకం కానున్నాయి. ఇదిలాఉంటే.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అఖిల భారత సర్వీస్ ఆధికారులు పూర్తిగా ప్రభుత్వ పెద్దల నియంత్రణలోకి వెళ్లినట్లైందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Also read: