Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. మద్యం ధరలను ఒక్కసారిగా పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ వేళ కూటమి సర్కార్ ధరలను పెంచడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మందుబాబులు ఫైర్ అవుతున్నారు. మద్యం ధరలు ఎంతవరకు పెరిగాయో ఇప్పుడు చూద్దాం.

Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?
Andhra Liquor Sales

Updated on: Jan 12, 2026 | 10:09 PM

ఏపీలో మందుబాబులకు కిక్కు దిగే వార్త. ప్రభుత్వం మద్యం ధరలను ఒక్కసారిగా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పండగ సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పండక్కి మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పండక్కి ఇంటికెళ్లినవారు సరదాగా తమ స్నేహితులతో మద్యం తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. ఇక కోళ్ల పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పాలుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉన్నట్లుంది లిక్కర్ ధరలను పెంచడంతో మద్యం తాగేవారికి షాక్ తగిలింది. పండుగ పూట మద్యం తాగాలంటే మరింత ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

పెరిగిన ధరలు ఇవే..

రూ.99 ఎంఆర్‌పీ ధర కలిగిన మద్యం బాటిళ్లను మినహాయించి మిగతా అన్నీ బాటిళ్లపై ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన అన్నింటిపై రూ.10 చొప్పున పెంచారు. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ లాంటి అన్ని రకాల బాటిళ్లపై ధరలు పెరిగాయి. అయితే రూ.99లోపు ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ధరలు పెంచకుండా ఉపశమనం కలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం ధరలను పెంచడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. ఇటీవల జనవరి 1న ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఇప్పుడు సంక్రాంతి పండక్కి మద్యం ధరలను పెంచడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి.

మార్జిన్ పెంచిన ప్రభుత్వం

ఇక రిటైలర్ మద్యం షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. రూ.99లోపు ఉండే మద్యం బాటిళ్లపై మార్జిన్‌ను 1 శాతం పెంచింది. దీంతో మద్యం షాపుల యజమానులకు లాభం జరగనుంది. అయితే పండుగ సమయాల్లో ధరలను పెంచడంపై మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయాల్లో పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బార్లు, వైన్ షాపుల్లో వేర్వురు ధరలు ఉండటంతో మందుబాబులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపంసంహరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.