Andhra Pradesh: వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు కాటు.. చివరకు ఏమైందంటే..?

సినిమాల్లోనో, చందమామ కథల్లోనో పాములు పగ పడతాయని వినుంటాం. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక ఊహించని నిజ జీవిత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తిని ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటు వేయడం, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని, విస్మయాన్ని నింపింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు కాటు.. చివరకు ఏమైందంటే..?
Farmer Dies Of Snake Bite Andhra Pradesh

Edited By:

Updated on: Jun 30, 2026 | 12:59 PM

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన రైతు ధూళిపాళ్ల వీరాంజనేయులు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఆయన జీవితంలో గత ఆరు నెలలుగా మృత్యువు పాము రూపంలో నీడలా వెంటాడింది. ఆరు నెలల క్రితం వీరాంజనేయులు తన సుబాబుల్ తోటలోకి వెళ్లినప్పుడు మొదటిసారి పాము కాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. మొదటి ప్రమాదం నుంచి కోలుకున్న కొద్దిరోజులకే, ఇంటి దగ్గర కాలువ శుభ్రం చేస్తుండగా రెండోసారి మళ్లీ పాము కాటు వేసింది. ఈసారి కూడా కుటుంబసభ్యులు కంగారు పడకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల శ్రమ ఫలించి రెండోసారి కూడా వీరాంజనేయులు మృత్యుంజయుడిగా నిలిచారు.

మూడోసారి వెనక నుండి వేటు..

రెండుసార్లు పాము కాటు నుంచి ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ విధి ఆయన్ను వదల్లేదు. తాజాగా వీరాంజనేయులు వాకింగ్‌కు వెళ్తున్న క్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక పాము వెనక వైపు నుండి వచ్చి ఒక్కసారిగా కాటు వేసింది. ఈ మూడో ప్రమాదంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎలాగైనా ఆయన్ను బతికించుకోవాలనే ఆశతో వెంటనే హాస్పిటల్‌కు పరుగు తీశారు. కానీ ఈసారి కాలం కలిసి రాలేదు. విషం శరీరం అంతా వేగంగా పాకడంతో.. హాస్పిటల్‌కు చేరుకునే లోపే మార్గమధ్యంలోనే వీరాంజనేయులు కన్నుమూశారు.

నిజంగానే పగ పట్టిందా…? సైన్స్ ఏం చెప్తోంది..?

ఒకే వ్యక్తిని ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటు వేయడం, అందులోనూ మూడోసారి వాకింగ్ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి కరవడంతో గ్రామంలో ‘‘పాము పగ పట్టింది’’ అనే ప్రచారం జోరందుకుంది. అయితే సైన్స్, వన్యప్రాణి నిపుణులు మాత్రం దీనికి భిన్నమైన వివరణ ఇస్తున్నారు. పాములకు పగలు, ప్రతీకారాలు గుర్తుపెట్టుకునే మేధస్సు ఉండదు. తోటల్లో, కాలువల దగ్గర లేదా పొదల పక్కన పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంటుంది. మనం నడుస్తున్నప్పుడు లేదా పనులు చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా వాటిపై కాలు పడటం లేదా అవి ముప్పుగా భావించడం వల్లే కాటు వేస్తాయి తప్ప, కావాలని గుర్తుపెట్టుకుని దాడి చేయవని చెబుతున్నారు. ఇది కేవలం దురదృష్టకరమైన యాదృచ్ఛికం మాత్రమే అని వివరిస్తున్నారు. కారణం ఏదైనా.. ఆరు నెలల వ్యవధిలో మూడు సార్లు పాము కాటుకు గురై, చివరికి ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం నక్కబొక్కలపాడు గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది.

 

గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, అవగాహన కోసం మాత్రమే రాయడం జరిగింది. పాము పగబడుతుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Loading...
Unable to load recommendations.
Follow Us