APSRTC: అందులో ఎలాంటి వాస్తవం లేదు.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. డిపోలు ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం, ఉద్యోగాల కోతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల అమలు, జీసీసీ విధానం, ఉద్యోగుల భద్రతపై కీలక వివరాలు వెల్లడించింది.

APSRTC: అందులో ఎలాంటి వాస్తవం లేదు.. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!
Apsrtc Electric Buses

Edited By:

Updated on: Jul 09, 2026 | 6:18 PM

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోందని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం సంస్థ వద్ద మొత్తం 10,661 బస్సులు ఉండగా, వాటిలో 8,012 సొంత బస్సులు, 2,649 అద్దె బస్సులు ఉన్నాయని వివరించింది. ప్రభుత్వ ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాల మేరకు 2029 నాటికి ఆర్టీసీ బస్సులన్నింటినీ విద్యుత్ ఆధారిత బస్సులుగా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇకపై కొనుగోలు చేసే కొత్త బస్సులు ప్రధానంగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది..

విద్యుత్ బస్సుల వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం తగ్గి, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యమంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం కింద వచ్చిన 100 ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతి–తిరుమల, తిరుపతి–నెల్లూరు, తిరుపతి–కడప, మదనపల్లె మార్గాల్లో విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, వీటిని 16 డిపోల నుంచి 11 నగరాల్లో నడపనున్నట్లు తెలిపారు. అందులో 750 బస్సుల టెండర్లు పూర్తికాగా, మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల అమలుతో ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని ఆర్టీసీ మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే డ్రై లీజ్ విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

అలాగే డిపోల్లో ప్రైవేటు సంస్థలకు ఇచ్చే స్థలం కేవలం ఛార్జింగ్, నిర్వహణ అవసరాల కోసమే ఉంటుందని, ఆ స్థలాల యాజమాన్యం పూర్తిగా ఆర్టీసీదేనని స్పష్టం చేసింది. ఒప్పందం ముగిసిన తర్వాత ఆయా సంస్థలు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us