Amalapuram Tensions: అమలాపురంలో ఇప్పుడు పరిస్థితి మధ్యలో ఉన్నామని, రాత్రి వరకు ఏ సమస్య లేకుండా చూస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమలాపురంలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో కరెంట్ తీసేశారని, ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉందన్నారు. ప్రస్తుతం ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయని చెప్పారు. కొంతమంది ఆందోళనకారుల దాడుల్లో గాయపడిన పోలీసులకు ప్రాణాపాయం ఏమీ లేదని డీఐజీ తెలిపారు. గాయాలపాలైన పోలీసులు ప్రస్తుతం బాగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అమలాపురంలో 600 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్పారు. కాగా, ప్రజలంతా సంయమనం పాటించాలని డీఐజీ పాలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ఇప్పటికే కొందరిని గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీల ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఏయే శక్తులు ఉన్నాయే అందరినీ బయటకు తీస్తామని, దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ స్పష్టం చేశారు.