గుంటూరు (Guntur) జిల్లా పెదకాకానిలో రెండురోజులుగా కొనసాగిన వైసీపీ (YCP) ప్లీనరీ ముగిసింది. తొలిరోజు నాలుగు రంగాలపై తీర్మానాలు ఆమోదించిన వైసీపీ.. రెండు రోజు మరో ఐదు తీర్మానాలు ఆమోదించింది. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేసింది. శుక్రవారం జరిగిన తొలిరోజు ప్లీనరీలో.. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ 90 (CM Jagan) నిమిషాలు సాగిన తన ప్రసంగంలో తమ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా చేపట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గడిచిన మూడేళ్ల తమ పాలన గురించి మాట్లాడారు. పథకాలు అమలు తీరుతెన్నులను ప్రస్తావించారు. మనిషికైనా, నాయకుడికైనా, రాజకీయ పార్టీకైనా వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యమని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అప్పటి ప్రభుత్వం గ్రామాలను దోచుకుందని వైఎస్ జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని జగన్ తెలిపారు.
ఈతరం పిల్లలు కూడా పొలాల్లో కూలీలుగా, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేసే పనివాళ్లుగా ఉండిపోవాలన్నది టీడీపీ ఆలోచన అని వైఎస్ జగన్ అన్నారు. అణగారిన వర్గాల కుటుంబాలు ఏనాటికి కూడా ఎదగకూడదన్నది బాబు విధానమని జగన్ ఆరోపించారు. అమ్మఒడి పథకం ద్వారా 80 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం పొందారని, నాడు- నేడు ద్వారా మారుతున్న పాఠశాలల రూపురేఖలు, అమ్మ ఒడి పథకం కింద రూ.19,617 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలోనే తొమ్మిది పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. నాడు – నేడు పథకం మంచి చేస్తుందని నమ్మి దాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని అన్నారు.
రైతు భరోసా, రైతు సంక్షేమ చర్యల ద్వారా 50 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. రైతుకు అన్ని విధాలుగా చేయూత అందిస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు. రైతు భరోసా కింద 23 వేల 875 కోట్ల రూపాయలు అందించామని జగన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం గురించి టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసిన గ్రామసింహాలు సింహాలు అయిపోవని జగన్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుందే రాష్ట్రం శ్రీలంక అవుతోందని తప్పుడు మాటలు అంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేయ్యడమంటే సంక్షేమ పథకాలను వ్యతిరేకించడమేనని జగన్ అన్నారు. చంద్రబాబు అండ్ కో దొంగల ముఠాతో జాగ్రత్త ఉండాలని తన ముగింపు సందేశంలో పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ హెచ్చరించారు.